చిన్నపాండూరు పిహెచ్‌సిలో…మహిళా ఉద్యోగికి అన్యాయం

చిన్నపాండూరు పిహెచ్‌సిలో...మహిళా ఉద్యోగికి అన్యాయం

చిన్నపాండూరు పిహెచ్‌సిలో…మహిళా ఉద్యోగికి అన్యాయంప్రజాశక్తి – వరదయ్యపాలెం మెడికల్‌ ఆఫీసర్‌ నిర్లక్ష్య ధోరణితో నెలల తరబడి జీతాలు అందక, కుటుంబ పోషణ భారమై దీనావస్థను ఎదుర్కొంటున్న మహిళా ఉద్యోగిని పరిస్థితి వర్ణనాతీతం. ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో, గత్యంతరం లేక ఆమె మీడియాను ఆశ్రయించారు. బాధితురాలి వివరాల మేరకు… చిన్నపాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎఫ్‌ఎన్‌ఒగా విధులు నిర్వహిస్తున్న సునీతకు 20 నెలలుగా జీతాలు అందలేదు. ఈ విషయమై యుడిసి సోమశేఖర్‌కు అనేకమార్లు విజ్ఞప్తి చేయగా 20వేలు లంచం ఇవ్వాలని, తాను చెప్పినట్లు వింటే వేతనం ఇచ్చేలా చూస్తానని బెదిరింపులకు దిగాడు. విసుగు చెందిన ఉద్యోగిని సామాజిక మాధ్యమాల ద్వారా తన బాధను వ్యక్తపరచింది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌ ఆమెకు అండగా నిలిచారు. యుడిసిగా పనిచేస్తున్న సోమశేఖర్‌ ఉద్యోగుల జీతాల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగుల లాగిన్లు మార్చివేయడం, సమయానికి రావాల్సిన జీతాలను తప్పుడు అబ్డేట్‌తో తారుమారు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆస్పత్రి నిర్వహణలో ప్రస్తుత మెడికల్‌ ఆఫీసర్‌ అలసత్వం కారణంగా యుడిసి ఆగడాలకు అడ్టుకట్ట లేకుండా పోయిందని, కిందిస్థాయి ఉద్యోగులపై కక్ష సాధింపుకు దిగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని డిఎంహెచ్‌ఒ శ్రీహరికి ఫిర్యాదు చేసినా స్పందించలేదని, ఉన్నతాధికారుల అండదండలు చూసుకుని యుడిసి సోమశేఖర్‌ ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని, రాత్రి సమయాల్లో ఒంటరి మహిళలకు డ్యూటీలు వేసి మానసికంగా హింసిస్తున్నారని వాపోతున్నారు. గత 20 నెలలుగా జీతం రాలేదని, ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని, రోజు గడవడమే కష్టంగా ఉందని, కుటుంబ పోషణ భారమయ్యిందని మహిళా ఉద్యోగిని కన్నీటి పర్యంతమయ్యారు. యుడిసిని సస్పెండ్‌ చేయాలి : సిఐటియు చిన్నపాండూరు పిహెచ్‌సిలో ఎఫ్‌ఎన్‌ఒగా విధులు నిర్వహిస్తున్న సునీతకు దాదాపు 20 నెలలుగా జీతం అందించకుండా, మానసిక క్షోభకు గురిచేస్తున్న యుడిసి సోమశేఖర్‌ను సస్పెండ్‌ చేయాలని సిఐటియు నాయకులు రమేష్‌ డిమాండ్‌ చేశారు. సునీతకు అందించాల్సిన పూర్తి బకాయిలను చెల్లించాలని కోరారు. డిఎంహెచ్‌ఒ, మెడికల్‌ ఆఫీసర్‌ అండ చూసుకునే సోమశేఖర్‌ ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని, సునీకు న్యాయం చేయకపోతే జిల్లా కేంద్రంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు.

➡️