మంత్రివర్గ విస్తరణలో మొండిచేయిటిడిపి జిల్లా క్యాడర్‌లో అసంతృప్తి సీనియర్లలో అంతర్గతంగా మనస్తాపం

మంత్రివర్గ విస్తరణలో మొండిచేయిటిడిపి జిల్లా క్యాడర్‌లో అసంతృప్తి సీనియర్లలో అంతర్గతంగా మనస్తాపంప్రజాశక్తి – తిరుపతి బ్యూరో గత ముప్పై ఏళ్లలో రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను కేవలం బొటాబొటీన రెండు వైసిపి గెలుచుకుంది. ఒకటి జనసేన, మిగిలిన 11 టిడిపి భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించింది. కుప్పం ఎంఎల్‌ఎ నారా చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి పదవితో పాటు, కనీసం రెండైనా మంత్రిపదవులు వస్తాయని టిడిపి శ్రేణులు ఆశించారు. అయితే బుధవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తప్ప, మిగిలిన ఎవరికీ ప్రాధాన్యత లేకపోవడంతో జిల్లా ప్రజలు అవాక్కయ్యారు. యువగళం పాదయాత్రలో రాయలసీమ మొత్తం ఇన్‌ఛార్జిగా ఉన్న పలమనేరు ఎంఎల్‌ఎ ఎన్‌.అమరనాథరెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని క్యాడర్‌లో చర్చ నడిచింది. ఆయనతో పాటు, ఎస్సీ సామాజికవర్గం లేదా, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవుల్లో చోటు లభిస్తుందనుకున్నారు. అయితే ఊహలకు భిన్నంగా మనస్తాపం మిగిలింది. జిల్లాలో టిడిపి ఎంఎల్‌ఎలతో పాటు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గ జాబితాను రాజ్‌భవన్‌కు పంపిస్తూ, మీడియాకు విడుదల చేశారు. జిల్లాలోని ఎంఎల్‌ఎల పేర్లు మంత్రివర్గంలో చోటు లేదని నిరుత్సాహానికి గురయ్యారు. సిఎం ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరైనప్పటికీ నిరుత్సాహంగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా పలమనేరు ఎంఎల్‌ఎ అమరనాథరెడ్డి, పీలేరు ఎంఎల్‌ఎ నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిలు ఆశించి భంగపడ్డారు. ముఖ్యమంత్రితో పాటు 26 స్థానాల్లో మంత్రివర్గ కూర్పు ఉంది. బుధవారం ప్రమాణ స్వీకారంలో 25 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్కటి మాత్రం నారా చంద్రబాబునాయుడు పెండింగ్‌లో ఉంచడంతో అది చిత్తూరు జిల్లాకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సంయమనం పాటించాలి గంగవరం : మంత్రి పదవి ప్రకటనపై టిడిపి కార్యకర్తలు సంయమనం పాటించాలని సీనియర్‌ నాయకులు వెంకట రమణారెడ్డి అన్నారు. పలమనేరు నియోజకవర్గం ఎంఎల్‌ఎ అమరనాథరెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంపై కార్యకర్తలు కినుక వహించడంతో పై విధంగా స్పందించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అమరనాథరెడ్డి దాదాపు 20వేల పైచిలుకు మెజార్టీతో అఖండ విజయం సాధించారన్నారు. తెలుగుదేశం క్రమశిక్షణకు మారుపేరని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంఎల్‌ఎ అమరనాథరెడ్డికి తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తారన్న నమ్మకం తనకు ఉందని, కావున అర్ధం చేసుకుని మెలగాలని హితవు పలికారు.

➡️