రారండోరు చదువు ‘కొందాం’నేటి నుంచి తెరచుకోనున్న బడులు ప్రైవేట్‌లో భారీగా ఫీజుల భారం ప్రభుత్వ పాఠశాలలకు స్టూడెంట్‌ కిట్స్‌

రారండోరు చదువు 'కొందాం'నేటి నుంచి తెరచుకోనున్న బడులు ప్రైవేట్‌లో భారీగా ఫీజుల భారం ప్రభుత్వ పాఠశాలలకు స్టూడెంట్‌ కిట్స్‌

రారండోరు చదువు ‘కొందాం’నేటి నుంచి తెరచుకోనున్న బడులు ప్రైవేట్‌లో భారీగా ఫీజుల భారం ప్రభుత్వ పాఠశాలలకు స్టూడెంట్‌ కిట్స్‌ ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం అంటే ఆనందిస్తున్నవారు, ప్రభుత్వ బడుల్లో ఉచితంగా విద్యను అందిస్తున్నా ఎందుకు పంపించరు?’… సోషల్‌ మీడియాలో సూటి ప్రశ్న. ‘ప్రభుత్వ బడుల్లో ఉత్తమ మార్కులు వస్తున్నా, నాడు-నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగులు వారి పిల్లలను ఎందుకు ప్రభుత్వ బడులకు పంపించరు? వారి స్కూళ్లపై వారికే నమ్మకం లేదా..?’ … సామాన్యుని ప్రశ్నప్రజాశక్తి – తిరుపతిబడి గంట మోగింది. చదువుకునే రోజులు, చదువు ‘కొనే’ రోజులూ ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు తెరచుకోనున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తరగతులు పున్ణప్రారంభం కానున్నాయి. దీంతో ప్రైవేటు స్కూళ్లలో చదివే పిల్లల తల్లిదండ్రులు ఒకరోజు ముందుగానే విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్స్‌, షూలు, పుస్తకాలు తదితర సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. పెంచిన ఫీజులను ఫస్ట్‌టర్మ్‌ చెల్లిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ సంబంధించిన ‘స్టూడెంట్‌’ కిట్స్‌ చేరుకుంటున్నాయి. అలాగే బడిగంటతో పాటు ‘వాటర్‌ బెల్‌’ కూడా మోగించి విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సి ఉంది. పాఠశాలల్లోనూ, కాలేజీల్లోని క్యాంటీన్లలో ‘జంక్‌’ ఫుడ్‌ లేకుండా పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉండాలి. అపుడే విద్యార్థులు ఆరోగ్యవంతమైన చదువులు చదవగలరు. ఈ విద్యా సంవత్సరం నుంచే ‘పేరెంట్‌ టీచర్‌… హోం విజిట్‌’ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. జూన్‌లో ఒకసారి, జనవరిలో మరోసారి పేరెంట్స్‌కు అనుకూలమైన వేళల్లో వారి ఇళ్లను సందర్శించాలి. విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచేందుకు సిద్ధం చేసిన ప్రణాళిక, బోధన తీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించాలి. జిల్లాలో మొత్తం 2,334 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 1817 ప్రాథమిక పాఠశాలలు కాగా, 194 ప్రాథమికోన్నత పాఠశాలలు. 323 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులకు గాలమేస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, కరపత్రాలు పంచుతూ అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. వేలల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు అయితే అనుమతులు లేకపోయినా పిల్లలను చేర్పించుకుంటున్నాయి. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్‌, టై, బెల్టు, షూ తదితర వాటిని యథేచ్ఛగా విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జిల్లాలో విద్యా వ్యాపారం జోరుగా సాగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులు తల్లిదండ్రులతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జీవో నంబరు 1 ప్రకారం గవర్నింగ్‌ బాడీ సమావేశాలు నిర్వహించి ఫీజులను నిర్ణయించాల్సి ఉంటుంది. సమావేశ తీర్మానాల ప్రకారం పాఠశాలలు నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఎక్కడా గవర్నింగ్‌ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

➡️