వరమాలపల్లిలో ‘విరూపాక్ష’

Jan 13,2024 11:55 #Varamalapalli, #Virupaksha
  • క్షుద్ర పూజలకు రూ.18 లక్షలు ఖర్చు!!
  • ప్రశ్నించిన అంబేద్కరిస్టు
  • గ్రామ బహిష్కరణ
  • పోలీసులు ప్రేక్షకపాత్ర
  • ఆలస్యంగా వెలుగులోకి..!

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : శాస్త్ర సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కాలమిది..సాంకేతిక పరిజ్ఞానంతో మృత్యువునే జయించగల్గుతున్న కంప్యూటర్‌ యుగమిది.. నాగరీకత బుల్లెట్‌ ట్రెయిన్‌లా విస్తరిస్తున్న ఈ కాలంలోనూ దెయ్యాలూ, భూతాలూ, పిశాచాలు లాంటి మూఢ నమ్మకాలు పల్లెల్లో ప్రబలుతుండటం నిజంగా సిగ్గుచేటు. మూఢ నమ్మకాలపై తీసిన విరూపాక్ష లాంటి చిత్రాలను మనం తెరపైన చూశాం. కానీ విరూపాక్ష లాంటి నిజమైన స్టోరీ నిజజీవితంలోనూ చోటు చేసుకుంది. గ్రామంలోకి దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, ప్రేతాత్మలు ప్రవేశించకుండా అష్టదిగ్భంధనం చేసేందుకు ఏకంగా రూ.18 లక్షలు ఖర్చు చేసిందీ ఆ గ్రామ పెద్దరికం. దాన్ని ప్రశ్నించిన ఓ అంబేద్కరిస్టును గ్రామ బహిష్కరణ చేయడం విచారకరం. ఈ సంఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం అముడూరు పంచాయతీ పరమాలపల్లి దళితవాడలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి పోతే..పరమాలపల్లి అటవీప్రాంతానికి దగ్గరగా ఉండే ఓ చిన్న గ్రామం. సుమారు 150 కుటుంబాల దళిత కుటుంబాలువారు నివాసం ఉంటున్నారు. మూడు కార్లూ పంటలు పండించుకుంటూ ఆనందంగానే జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల ఆ గ్రామంలోని ఓ మహిళకు దెయ్యాల భయం పట్టుకుంది. తన మానసిక పరిస్థితి అంత బాగోలేకపోవడంతో తన ఇంట్లో దెయ్యం తిష్ట వేసినట్లు నమ్మింది. దాన్ని తరిమికొట్టేందుకు రాయలచెరువు ప్రాంతానికి చెందిన హరి అనే భూత వైద్యుడిని సంప్రదించింది. ఆయన చేత తన ఇంటికి మంత్రాలతో అష్టదిగ్భంధనం చేయించింది. అయినా ఆమె కుటుంబంలో మనశ్శాంతి కరువవడంతో మళ్లీ భూత వైద్యుడిని సంప్రదించింది. దీంతో ఆయన దెయ్యం మీ ఇంట్లోనే కాదు, మీ ఊరి చుట్టూ కూడా ఉన్నాయనీ, గ్రామాన్ని అష్టద్భింధనం చేస్తే కానీ వాటిని తరిమి కొట్టలేమంటూ ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో ఆమె భూత వైద్యుడి మాటలు గుడ్డిగా నమ్మి అష్టదిగ్భంధనం చేయించేందుకవసరమైన నిధులను, గ్రామ పెద్దల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేసింది. ఆ మహిళ పొదుపు సంఘంలో ఓ లీడర్‌కూడా కావడంతో తన ఉపాయాన్ని పొదుపు మహిళల నుంచి మొదలు పెట్టింది. గ్రామంలో దెయ్యాలూ, భూతాలు తిరుగుతున్నాయనీ, అష్టదిగ్భంధనం చేస్తే కానీ అవిపోవనీ, దానికి చాలా ఖర్చువతుందంటూ వివరించింది. అది నమ్మిన పొదుపు మహిళలు తాము నెల నెలా చెల్లించే రుణం నుంచి రూ.3 వేలు ఆమె వద్ద చేర్చారు. ఆ గ్రామంలో ఉన్న 16 గ్రూపుల నుంచి సుమారు రూ.8 లక్షల నగదును వసూలు చేసి ఆ భూత వైద్యుడి చేతుల్లో పెట్టారు. అదీ చాలకపోవడంతో గ్రామ పెద్దలను ఒప్పించి గ్రామంలో నిల్వ ఉన్న నగదు రూ.10 లక్షలను కూడా తీసుకెళ్లి భూత వైద్యుడికి అప్పగించారు. ఈ తంతంగమంతా గతేడాది జూలై నుంచి డిసెంబరు వరకు సాగింది. అయితే అదేనెలలో తమ పొదుపు రుణాల డబ్బులు భూత వైద్యుడికి ఖర్చు చేస్తున్న సంగతి తెలుసుకున్న అంబేద్కరిస్టు, ప్రజా గాయకుడు, రచయిత, ఆర్టీసీ ఉద్యోగి అముడూరు.బాలరాజు సంఘమిత్రను గట్టిగా ప్రశ్నించాడు. తనకేమీ తెలియదనీ, గ్రూపులీడర్లు చేస్తున్న నిర్వాహకాన్ని ఆమె బాలరాజుకు విన్నవించింది. దీంతో బాలరాజు తాము క్షుద్రపూజలు చేసేందుకు నగదు చెల్లించబోమని, ఇలా చేయడం తప్పని వారించాడు. అయినా వినకపోవడంతో 100కు డయల్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏర్పేడు పోలీసులు గ్రామంలోకి వచ్చి గ్రామస్తులను మందలించి వెళ్లారు. దీనిపై ఆగ్రహించిన పొదుపు మహిళలు, గ్రామ పెద్దలు డిసెంబరు 18న గ్రామంలో పంచాయితీ పెట్టి బాలరాజును నిలదీశారు. నువ్వు చేసింది తప్పనీ, గ్రామ కట్టుబాట్లకు తలొగ్గాలనీ, చేసిన తప్పుకు రూ.లక్ష జరిమానా కట్టాలంటూ హుకుం జారీ చేశారు. లేకుంటే గ్రామ బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. దానికి బాలరాజు ససేమిరా అనడంతో చివరకు బాలరాజును ఆ ఊరి గ్రామ పెద్దలు ఏకంగా ఊరి బహిష్కరణ చేశారు. దీంతో బాలరాజు ఏర్పేడు పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రస్తుతం బాలరాజు ఊరికి అవతలే తన కుటుంబంతో గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. దెయ్యాలూ, భూతాలు లేవని సమాజం కోడై కూస్తున్న తరుణంలో, మూఢనమ్మకాలు తప్పని హెచ్చరించిన బాలరాజు లాంటి అంబేద్కరిస్టును ప్రశంసించాల్సిందిపోయి బహిష్కరించడం ఎంతవరకు సబబో ఆలోచించాలి. గ్రామంలో నెలకొన్న మూఢ నమ్మకాలను పారదోలి వారిలో చైతన్యం నింపాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విచారకరం. ఈ విషయమై ఏర్పేడు పోలీసు అధికారిని వివరణ కోరగా అలాంటిదేమీ లేదని చెప్పడం గమనార్హం.

➡️