ఎవరికి వారే ధీమా

May 17,2024 20:03

అంచనాల్లో తల మునకలు

ప్రజాశక్తి-గజపతినగరం  : గజపతి నగరం నియోజక వర్గంలో వైసిపి, టిడిపి అభ్యర్థులు గెలుపు అవకాశాలపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ ముగియడంతో పార్టీ నాయకులతో వైసిపి, టిడిపి అభ్యర్థులు సమావేశాలు నిర్వహించారు. గ్రామాల వారికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి. తమ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి? ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తుంది? ఎంత నష్టం కలుగుతుందో అంచనాలు వేసుకున్నారు. ఈ లెక్కన వైసిపి అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య 8 నుంచి 9 వేల ఓట్ల మెజార్టీతో గట్టెక్కుతామని భావిస్తుండగా, టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ మాత్రం 20వేల ఓట్లు మెజార్టీతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ పది రోజుల ముందు వరకూ ఇక్కడ వైసిపికే గెలుపు అవకాశాలు ఉన్నాయని, డబ్బు ప్రభావం బాగా చూపుతుందని విశ్లేషకులు భావించారు.కానీ అనూహ్యంగా టిడిపి అభ్యర్థి శ్రీనివాస్‌ పలు గ్రామాల ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఓటర్లు ఎక్కువగా ఉన్న గజపతినగరం, పురిటిపెంట, బొండపల్లి, దేవుపల్లి, గంట్యాడ, మరుపల్లి, మానాపురం తదితర గ్రామాల్లో ప్రభావితం చూపగలిగారు. వైసిపికి ఎక్కువ ఓట్లు పోలవుతాయని భావించిన చోట ఓట్లను చీల్చగలిగారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. డబ్బుల పంపిణీలోనూ వైసిపికి కంటే తాము తక్కువేమీ కాదన్నట్లు చేశారు. ఈ నేపథ్యంలో గెలుపు గ్యారెంటీ అని చెబుతున్నారు. అంతేకాకుండా పలు గ్రామాల వైసిపి నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు టిడిపిలో చేరడంతో వారిలో గెలుపు ధీమా ఎక్కువగా కనిపిస్తోంది. వైసిపికి సంబంధించి నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో గత ఎన్నికల్లో మెజార్టీ ఎక్కువగా రాగా, ఈసారి టిడిపికే 2వేలు వరకు మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు. గంట్యాడలో 4వేలు, బొండపల్లిలో 2వేలు, దత్తిరాజేరులో వెయ్యి ఓట్లు మొత్తంగా 9వేలు మెజార్టీతో గెలు పొందుతామని లెక్కలు వేసుకున్నారు. కానీ గజపతినగరంలో ఎమ్మెల్యే అప్పల నర్సయ్య పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన చేసిన కూ కబ్జాలు, జాతీయ రహదారి విస్తరణలో చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టడం, రైతుల వద్ద భూములు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకపోవడం వంటి ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. ఇవన్నీ ఓట్ల రూపంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే దత్తిరాజేరు మండలంలో గత ఎన్నికల్లో సుమారు 9వేల ఓట్లు వరకు మెజార్టీ వచ్చింది. ఈసారి 70శాతం వరకు ఓట్లు టిడిపికే పడతాయని ఆమండలంలోని ఓటర్ల నాడీ చెబుతుంది. ఈ నేపథ్యంలో టిడిపికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

➡️