నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత

Apr 27,2024 22:41

బాలుని మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబీకులు
ప్రజాశక్తి పెదకూరపాడు :
వేసవి సెలవులకని మేమమామ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు కుతూహలం కోసమని నీటి గుంతలతో దిగి మృత్యువాత పడ్డారు. మండలంలోని కన్నెగండ్లలో శనివారం జరిగిన ఘటనపై స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన బత్తుల ప్రకాష్‌కు నలుగురు చెల్లెళ్లు కాగా వీరిలో మూడో చెల్లెలైన నరసమ్మను పెదరకూపాడులోని మేనమామ కుమారుడైన పమిడిపల్లి చినవెంకటేశ్వర్లుకు, నాలుగో చెల్లెలైన హేమమ్మను సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన బుల్లెద్దుల క్రీస్తుబాబుకు ఇచ్చి వివాహం చేశారు. నరసమ్మకు వేణుగోపాల్‌ (11), శ్రావణి అనే ఇద్దరు సంతానం కాగా హేమమ్మకు ధనూష్‌ (13), ప్రశాంత్‌ ఇద్దరు కుమారులున్నారు. వేణుగోపాల్‌ పెదకూరపాడులోనే ఐదో తరగతి పూర్తి చేసుకోగా, ధనుష్‌ అబ్బూరులో 7వ తరగతి పూర్తి చేశాడు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో పిల్లలంతా మేనమామ ఊరైన కన్నెగండ్లకు నాలుగు రోజుల కిందట వచ్చారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ధనూష్‌, వేణుగోపాల్‌, ప్రశాంత్‌ కలిసి కాలనీకి సమీపంలోని పొలాల్లోకి వెళ్లారు. అక్కడ అల్లిపరవు వాగు వద్ద ఉన్న పొలాలకు నీరు నిల్వ చేసుకోవడానికి తవ్విన గుంతను చూశారు. ఇటీవల తాగు అవసరాల కోసం కాల్వలకు విడుదల చేసిన నీరు కొంత ఆ గుంతలో చేరడంతో అందులో ఈత వేసేందుకని దిగారు. అయితే చాలాకాలం క్రితం తవ్విన గుంత కావడం, అప్పటికే అందులో మట్టి చేరి ఉండడంతో కూరుకుపోయారు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని గేదెల కాపరులు అక్కడికి వచ్చి గమనించగా ప్రశాంత ఒక్కడే కేకలు వేస్తూ కనిపించాడు. దీంతో అతన్ని ఒడ్డుకు లాగారు. ప్రశాంత్‌ సమాచారం ఆధారంగా మరో ఇద్దరు నీటిలో ముగినిపోయారని తెలుసుకుని మోటార్లను తెప్పించి నీటిని తోడారు. క్రేన్‌ను తీసుకువచ్చి మట్టిలో కూరుకుపోయిన ధనూష్‌, వేణుగోపాల్‌ మృతదేహాలను వెలికితీశారు. అనంతర ఇద్దరి మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకెళ్లారు.

➡️