ద్విచక్ర వాహనం అదుపు తప్పి చిన్నారి మృతి

Apr 9,2024 14:31 #prakasam, #road accident

ప్రకాశం :ఉగాది సంబరాలు జరుపుకొనుటకు అమ్మమ్మ ఇంటి నుండి నాయనమ్మ ఇంటికి ద్విచక్ర వాహనంపై వచ్చే క్రమంలో తల్లి బిడ్డల పాలిట రోడ్డు ప్రమాదం సంభవించటంతో కుమార్తె దుర్మరణం చెందిన సంఘటన కొండపి మండలంలోని కట్టుబడిపాలెం ,వెన్నూరు గ్రామాల మధ్య చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలములోని గోగినేని వారి పాలెం గ్రామానికి చెందిన గోగినేని సురేష్‌ , శాంతి దంపతులకు కుమార్తె , కుమారుడు ఉన్నారు. సురేష్‌ కొండపిలోని ఎన్టీఆర్‌ కూడలి వద్ద జ్యూస్‌ పాయింట్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సదరు బాధితుడు భార్య శాంతి నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొండముచ్చు పాలెం అమ్మవారింటికి వెళ్లింది. మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై తన బిడ్డలతో గోగినేని వారి పాలెం గ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలో కట్టుబడిపాలెం దాటిన తరువాత వచ్చే ప్రధాన మలుపులో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న గోతిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శాంతి, ఆమె కుమార్తె ,కుమారుడుకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన గమనించిన ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు వెంటనే 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఒంగోలుకు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర గాయాల పాలైన యశ్వంత్‌ లక్ష్మి దుర్మరణం పాలయ్యింది. తల్లి, కుమారుడు కు మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి చేర్పించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. యశ్వంత్‌ లక్ష్మి కందుకూరులోని గౌతమి స్కూల్లో రెండవ తరగతి చదువుతున్నది. ఈ విషయం తెలుసుకున్న రెండు గ్రామాల వారు దిగ్భ్రాంతికి గురయ్యారు.

➡️