జమకాని నిధులు.. పింఛనుదారుల పడిగాపులు

ప్రజాశక్తి-పీలేరు సామాజిక పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరిమహిళలు సచివాలయాల వద్ద పడిగాపులు కాశారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పింఛను కోసం వేచి చూశారు. సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అధికారులు పంపిణీ చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికారులు స్థానిక సచివాలయాల వద్ద పింఛనుదారులకు కనీస సౌకర్యాలైన షామియానా, కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించారు. మధ్యాహ్నం వరకు కూడా పింఛను డబ్బులు పంపిణీ చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాల బ్యాంక్‌ ఖాతాలో పింఛను నిధులు జామకాకుండా పోవడంతో సచివాలయాల కార్యదర్శులు, సంక్షేమ అధికారులు తమకు కేటాయించిన బ్యాంకుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరీక్షించక తప్పలేదు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి సచివాలయాల ఖాతాలకు జమైన ఆరకొర నిధులతో సిబ్బంది ఆరు గంటల నుంచి అందిన నిధులను పెన్షన్‌ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పీలేరు మండలంలోని 16 సచివాలయాల పరిధిలో 9927 మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. వీరందరి కోసం రూ.2,90,92,000 నిధులు అవసరమున్నాయి. పీలేరు మండల పరిధిలోని 16 సచివాలయాల్లో ఒక్కో సచివాలయానికి రూ.9,31,500 నుంచి రూ.31,92,500 వరకు నిధులు అవసరం ఉన్నాయి. అయితే బుధవారం సాయంత్రం వరకు కూడా ప్రభుత్వం నుంచి సచివాలయాల ఖాతాలకు కేవలం రూ.90 వేలు మొదలు రూ.9 లక్షల వరకు మాత్రమే నిధులు జమయ్యాయి. లబ్ధిదారుల పంపిణీ కోసం తగినన్ని నిధులు అందకపోవడంతో సచివాలయ ఉద్యోగులు తమ పై అధికారుల సూచనలు, సలహాలు, ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులు ఒకరి నుంచి ఒకరు నిధులు సర్దుకుంటూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందఠంగా ఎంపీడీవో ఉపేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు, వీధి, విధానాలను అనుసరించి అందిన పెన్షన్ల నిధులను పంపిణీ చేయడానికి సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. అందుతున్న నిధులతో సచివాలయాల ద్వారా పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారు. నిమ్మనపల్లి : పింఛనుదారులకు పింఛను పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం సచివాలయ కేంద్రంలోని ఉద్యోగుల ద్వారా మధ్యాహ్నం నుంచి చేపట్టినట్లు ఎంపిడిఒ షాలెట్‌ తెలిపారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయ ఉద్యోగుల చేత నిర్వహిస్తున్నట్లు వివరించారు. గతంలో వాలంటీర్లు నేరుగా పింఛన్లను పింఛనుదారుల ఇంటి వద్దనే అందించే వారిని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా వారిని ఎన్నికల కమిషన్‌ పక్కన పెట్టిందని తెలిపారు. మండలంలో 5 వేలకు పైగా వివిధ రకాల పింఛనుదారులు ఉన్నారని, వారందరికీ ఈనెల 6వ తేదీ వరకు పింఛను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మంచానికే పరిమితమై ఉన్నవారు, నడవలేని వారికి సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను అందిస్తారని తెలిపారు. సచివాలయ కేంద్రాల వద్ద పింఛనుదారుల కోసం షామియానాలు, కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

➡️