అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టండి

ఆదివాసీ గిరిజన సంఘం

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైజేషనకు అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టండి

ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్‌

ప్రజాశక్తి -పాడేరు : వైద్య ఆరోగ్యశాఖ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్న సిఆర్‌టిలు, ఇతర సిబ్బంది రెగ్యులేషన్‌లో అక్రమ వసూళ్లకు, అక్రమాలకు పాల్పడినట్లు కొంతమంది సిఆర్‌టిలు చేస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ నిర్వహించాలని ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్షులు ధర్మన్న పడాల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్‌ డిమాండ్‌చేశారు. సంఘం జిల్లా కమిటీ తరుపున జిల్లా కలెక్టర్‌, ఐటిడిఎ పిఒలు దీనిపై స్పందించాలని కోరారు. ఈ విషయంపై మంగళవారం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్‌ అధ్యక్షులు ధర్మన్న పడాల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజేషన్‌ కోసం ఆదివాసీ గిరిజన సంఘం అనేక మార్లు పాడేరులో ఉద్యమం నిర్వహించి రాజకీయ డిమాండ్‌గా మార్చడంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ప్రభుత్వం అనుమతించిందని, ఇది ఆదివాసీ గిరిజన సంఘం సాధించిన విజయమన్నారు. అయితే కొంతమంది అవినీతి అధికారుల నిర్వాకం వలన అర్హులైన అనేక మంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని, దీనిపై దృష్టి పెట్టాలనికోరారు. జిల్లా అధికార్లకు పైల్‌ పంపకుండా రాష్ట్ర అధికార్లు, వైద్య ఆరోగ్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కుమ్మక్కై అక్రమ వసూలు చేశారనీ, ఒక్కొక్కరి నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికార్లకు రూ.ఒక లక్ష, జిల్లా అధికారులకు రూ. 25వేలు చొప్పున ఇవ్వాలని వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. దీని వల్ల ముడుపులు చెల్లించలేని అర్హులైన ఎందరో రెగ్యులరైజేషన్‌ అవకాశాన్ని కోల్పోవడమే కాకుండా, కొందరు అడ్డదారికి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోందన్నారు.

మాట్లాడుతున్న ఆదివాసీ గిరిజన సంఘం నేతలు

➡️