అమలుకు నోచని హామీలు

Apr 6,2024 21:45

 పరిశ్రమల మూతతో వీధిన పడిన వందలాది మంది కార్మికులు

చెరకు సాగుకు దూరమైన రైతులు

వైసిపి, టిడిపి రెండింటిదీ ఒకటే వైఖరి

పాదయాత్రలో ఇచ్చిన హామీలను మరచిన జగన్‌

ప్రజాశక్తి-బొబ్బిలి : రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మూతపడిన శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యూట్‌ మిల్లు, లచ్చయ్యపేట ఎన్‌.సి.ఎస్‌ చక్కెర పరిశ్రమను తెరిపిస్తామని 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగాను, ఎన్నికల సభలోనూ సిఎం జగన్మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. హామీలు ఇచ్చిన ఐదేళ్ల తర్వాత ఎన్నికలు రావడంతో గతంలో ఇచ్చిన హామీలు ఎక్కడంటూ కార్మికులు, చెరకు రైతులు ప్రశ్నిస్తున్నారు. జ్యూట్‌ పరిశ్రమలు మూతపడడంతో 3,500మంది కార్మికులు రోడ్డున పడగా సుమారు 2500మంది రైతులు గోగుసాగుకు దూరమయ్యారు. చక్కెర పరిశ్రమ మూతతో 600మంది రెగ్యులర్‌, కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడగా 1500మంది చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టిడిపి, వైసిపి హయాంలో జ్యూట్‌ పరిశ్రమలు మూతవేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించే జ్యూట్‌ పరిశ్రమలు టిడిపి, వైసిపి రెండింటి హయాంలోనూ మూత పడ్డాయి. టిడిపి హయాంలో శ్రీలక్ష్మి శ్రీనివాస, జ్యోతి జ్యూట్‌ మిల్లులు మూతపడగా, వైసిపి హయాంలో నవ్య జ్యూట్‌ మిల్లు మూతపడింది. ఈ మూడు మిల్లుల మూతతో 3,500 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఉపాధి కోల్పోయిన కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నారు.చక్కెర పరిశ్రమ మూతతో ఉపాధికి గండిలచ్చయ్యపేట చక్కెర పరిశ్రమ మూతపడడంతో కార్మికులు, చెరకు రైతులు ఉపాధికి గండి పడింది. చక్కెర పరిశ్రమలో 600మంది కార్మికులు పని చేసి జీవనోపాధి పొందేవారు. చక్కెర పరిశ్రమ కోసం చెరకు సాగు చేసుకుని 1500మంది రైతులు జీవనోపాధి పొందేవారు. పరిశ్రమ మూతతో వీరంతా ఉపాధి కోల్పోయి హోటళ్లు, షాపులలో పని చేసుకుని జీవనోపాధి పొందగా మరికొందరు ఇతర ప్రాంతాలకు భవన నిర్మాణ పనులకు వలస వెళ్లిపోయారు. కొంతమంది రైతులు చెరకు సాగుకు దూరమవ్వగా మరికొందరు రైతులు చెరకు సాగు చేసుకుని బెల్లం క్రషర్లకు, సంకిలి చక్కెర పరిశ్రమకు చెరకు సరఫరా చేస్తున్నారు. కార్మికులకు, రైతులకు ద్రోహంరాష్ట్రంలో వైసిపి, టిడిపి కార్మికులకు, రైతులకు తీవ్ర ద్రోహం చేస్తున్నాయి. టిడిపి హయాంలో మూతపడిన శ్రీలక్ష్మి శ్రీనివాస, జ్యోతి జ్యూట్‌ మిల్లులను తెరిపిస్తామని, ఎన్‌.సి.ఎస్‌ చక్కెర పరిశ్రమ కార్మికులు, రైతులను ఆదుకుంటామని పాదయాత్ర, ఎన్నికల సభలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ ఆదిశగా ప్రభుత్వం అడుగులు వేయలేదు. పైగా అప్పటికే నడుస్తున్న నవ్య జ్యూట్‌ పరిశ్రమ, ఎన్‌సిఎస్‌ చక్కెర పరిశ్రమలు పూర్తిగా మూతపడేందుకు సహకరించింది. జ్యూట్‌ మిల్లు స్థలం అమ్మకంలో ఎమ్మెల్యేది కీలకపాత్రజ్యూట్‌ పరిశ్రమలు తెరిపిస్తామని హామీ ఇచ్చిన వైసిపి నాయకులే జ్యూట్‌ మిల్లు స్థలం అమ్మకంలో కీలకపాత్ర పోషించారు. అధికారం చేపట్టిన మిల్లులను తెరిపించకపోగా, శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యూట్‌ మిల్లు స్థలాన్ని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అమ్మివేసేందుకు సహకరించారు. జ్యూట్‌ మిల్లు స్థలాన్ని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అమ్మివేసి కార్మికులకు పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాడ్యుటీ బకాయిలు చెల్లిస్తామని ఎమ్మెల్యే చెప్పినా, ఇప్పటికీ 1200మంది కార్మికులకు రూ. కోటి63లక్షలు పిఎఫ్‌ బకాయి చెల్లించలేదు. 55ఏళ్లు నిండిన 312మంది కార్మికులకు పిఎఫ్‌ పెన్షన్‌ అందడం లేదు. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అమలుకు నోచని హామీలు

పిఎఫ్‌ బకాయిలు చెల్లించాలి

శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యూట్‌ మిల్లు కార్మికులకు పిఎఫ్‌ బకాయిలు తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని యాజమాన్యం అమలు చేయకపోయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఒప్పందాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి.

వి.శేషగిరిరావు, ఆదర్శ కార్మిక సంఘం అధ్యక్షులు

కార్మికులకు దగా చేస్తున్న టిడిపి, వైసిపిజ్యూట్‌, చక్కెర కార్మికులకు టిడిపి, వైసిపి దగా చేశాయి. మూతపడిన పరిశ్రహలను ఈ రెండు పార్టీలూ తెరిపించలేదు. కార్మికుల ప్రయోజనాలు కంటే యాజమాన్యాల ప్రయోజనాల కోసమే ఈ రెండు ప్రభుత్వాలూ పనిచేవాయి. మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయాలి .

పి.శంకర్రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు

టిడిపి, వైసిపిలకు చిత్తశుద్ధి లేదు

జ్యూట్‌ పరిశ్రమలు, చక్కెర పరిశ్రమలను తెరిపించేందుకు టిడిపి, వైసిపిలకు చిత్తశుద్ధి లేదు. ఏపార్టీ అధికారంలో ఉన్నా పరిశ్రమలు మనుగడ కోసం పని చేయడం లేదు. పరిశ్రమల మూతతో కార్మికులు రోడ్డున పడడంతో పాటు రైతులు కూడా ఉపాధి కోల్పోతున్నారు. పరిశ్రమలను తెరిపించి కార్మికులు, రైతులను ఆదుకోవాలి.

సింగిరెడ్డి గోపాలం, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు

 

➡️