వేళాపాళాలేని విద్యుత్‌ కోతలు!

వేళాపాళాలేని విద్యుత్‌ కోతలు!

రాత్రి వేళ కరెంట్‌ నిలుపుదలతో జనం కష్టాలు

ఉక్కిరిబిక్కిరి అవుతున్న వృద్ధులు, చిన్నారులు

ఏవేవో కారణాలను చెబుతున్న అధికారులు

ప్రజాశక్తి -తగరపువలస : వేళాపాళా లేకుండా ఎడాపెడా విద్యుత్‌ కోతలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చిట్టివలస విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో ఒకటో వార్డు కొత్తపేట, కొండపేట, జ్యూట్‌ కార్మికవాడ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోంది. ఇదేంటని ఎపిఇపిడిసిఎల్‌ అధికారులు, సిబ్బందిని అడిగితే ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపమని, ఇంకెవేవో కారణాలను చెబుతున్నారువిద్యుత్‌ సబ్‌స్టేషన్లలో నిర్వహణ పనులు, విద్యుత్‌లైన్లపై ఉన్న చెట్లకొమ్మల తొలగింపు, ఇతర మరమ్మతు పనుల సమయంలో సంబంధిత అధికారులు పత్రికా ప్రకటనలిచ్చి అధికారికంగా విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేస్తున్నారు. అవి అధికారిక కరెంట్‌ కోతలు అంతవరకూ బాగానే ఉంది. కానీ రోజంతా ఎడతెరిపి లేకుండా కరెంట్‌ కోతలను ఏమనాలని స్థానికులు కొందరు ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో కూడా విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేయడం అనధికార కోత కాక మరేంటని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు వేసవి తాపం, ఉక్కపోత.. ఇంటా, బయటా ఎక్కడా ఉండలేని పరిస్థితి, అదేసమయంలో మరోవైపు ఇలా వేళాపాళాలేకుండా కరెంట్‌ కోతలు విధించి, స్థానికులను ఇబ్బందులకు గురిచేయడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాత్రి వేళ కరెంట్‌కోతతో కంటిమీద కునుకు లేకుండా పోతోందని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ట్రాన్స్‌కో అధికారులు స్పందించి, అప్రకటిత విద్యుత్‌ కోతలను నివారించాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

కరెంట్‌ కోతలతో అల్లాడిపోతున్న జనం

పరవాడ :ఒకవైపు భానుడి ప్రతాపంతో మండుతున్న ఎండలు, ఉక్కపోత, మరో వైపు అప్రకటిత విద్యుత్‌ కోతలతో జనం అల్లాడిపోతున్నారు. మండలంలో ప్రతిరోజూ సాయంత్రం సమయంలో ఒకసారి, రాత్రి నిద్రించిన తరువాత మూడు నాలుగు సార్లు విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేస్తున్నారు. పగలు కూడా ఎప్పుడు తీస్తారో, ఎప్పుడు ఇస్తారో తెలియలేని గందరగోళ పరిస్థితి నెలకొంది. గత 15 రోజుల నుండి తీవ్రమైన విద్యుత్‌ కోతలు కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా కష్టపడి ఇంటికి చేరుకున్న కూలీలు రాత్రి సమయంలో కరెంటు పోవడంతో ఉక్కపోత, దోమల దండయాత్ర కారణంగా నిద్ర లేక మళ్లీ ఉదయం తమ పనులకు వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు. కరెంటు కోతలు లేవంటూనే అనధికారిక కోతలు విధిస్తుండడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రాత్రి సమయంలో కరెంటు కోతలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు

➡️