ఉత్తరాంధ్రను దోచుకున్నారు

May 2,2024 21:58

అధికారంలోకి వస్తే పాలకొండను బంగారు కొండ చేస్తాం

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

ప్రజాశక్తి-పాలకొండ : ఉత్తరాంధ్రను రెడ్డిలు దోచుకున్నారని, పూర్తిగా ఇసుకదందా, భూ కబ్జాలు, మైనింగ్‌ యాఫియాలకు నిలయమైందని, ఈ అవినీతి అక్రమాలను తరిమికొట్టాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పాలకొండ విచ్చేశారు. తొలుత విపి రాజుపేట జంక్షన్‌ వద్ద హెలికాఫ్టర్‌ దిగిన పవన్‌ కల్యాణ్‌ అక్కడి నుంచి రోడ్‌ షోలో వడమ జంక్షన్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ జరిగిన సభలో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో అవినీతికి వైవి సుబ్బారెడ్డి, మిథిన్‌ రెడ్డిలు సూత్రదారులన్నారు. తాను ఒక ఉద్యోగి కొడుకునని, ఉద్యోగస్థులు కష్టాలు తనకు తెలుసునని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సిపిఎస్‌కు ప్రత్నామ్యాయం చర్యలు చేపడతానని అన్నారు. శ్రీకాకుళం యాస, భాష తనకు ఎంతో ఇష్టమని, ఉత్తరాంధ్ర పాటలు పాడి ఆలరించారు. రూ.25 కోట్లు ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం వృథా చేసిందని, రంగులు వేయడానికి ఖర్చు చేసిన డబ్బులతో సాగునీటి ప్రాజెక్టులు జీవనాధారమైన తోటపల్లి, జంపరకోట ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చునని తెలిపారు. ఆయన మాట్లాడుతున్న దగ్గర ముఖ్యమంత్రి జగన్‌ సిద్ధం కటౌట్‌ చూసి దేనికి సిద్ధమని వ్యాఖ్యనించారు. ఎన్నికల కమిషన్‌కు ఇది కనిపించలేదన్నారు. మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్‌ రెడ్డి మద్యం వ్యాపారం చేస్తూ రూ.40లు బాటిల్‌ రూ.200కు విక్రయించి ఐదేళ్లులో 40 వేలు కోట్లు జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పోలవరం 70 శాతం పూర్తి చేస్తే జగన్‌ ఆ ఊసే ఎత్తలేదన్నారు.

ఉత్తరాంధ్రను దోచుకున్నారు

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.450కోట్లు డబ్బులు దారిమళ్లిస్తే, అదే సంక్షేమ నిధికి తన వంతుగా రూ.కోటి సాయం అందించానని అన్నారు. తాము అధికారంలోకి రాగానే కార్మిక సంక్షేమ నిధి పునరుద్దరిస్తామని, డిజిటల్‌ హెల్త్‌కార్డులు, విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ అందజేస్తామని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు పంచాయతీల వరకు చేరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఐటిడిఎ ద్వారా ట్రైకార్‌ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. పాలకొండ ఏజెన్సీలో జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధిచేసి, ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. నాగావళిలో ఇసుక దోపిడీ అరికడతామన్నారు. పాలకొండను బంగారు కొండ చేస్తామని అన్నారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి గురించి పట్టించుకోలేదని అన్నారు. అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రజలను నిండా ముంచేశారని విమర్శించారు. సభలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశ్విస్విని, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్‌, పరిశీలకులు గంగులయ్య, మాజీ ఎఎంసి చైర్మన్‌ పొదిలాపు కృష్ణమూర్తి, డాక్టర్‌ దానేటి శ్రీధర్‌, కొరికాన రవి, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పడాల భూదేవి తదితరులు పాల్గొన్నారు.పాటపాడిన పవన్‌ కల్యాణ్‌ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్ర పాటలు పడుతూ అలరించారు. ‘తాటిచెట్టు ఎక్కలేవు..తాటికల్లు తెంపలేవు.. ఈత చెట్టు ఎక్కలేవు. ఈతకల్లు తెంపలేవు.. మళ్లీ నీకెందుకురా పెళ్లి’ అంటూ పాట పాడుతూ అభిమానులను అలరించారు.

➡️