వర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం మరువలేనిది : విసి భారతి

ప్రజాశక్తి – క్యాంపస్ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా అకాడమిక్ పరంగా కావచ్చు, ఇతర అంశాలలో రాష్ట్రంలో వర్సిటీ ఉన్నత స్థానంలో నిలవడానికి ప్రతి ఒక్కరి సహకారం మరువలేనిదని వర్సిటీ ఉపకులపతి ఆచార్య దేవూరి భారతి పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య దేవూరి భారతి ఒక సంవత్సరం పదవీ కాలాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న సందర్భంగా యూనివర్సిటీ అధ్యాపకులు, బోధినేతర సిబ్బంది ఉపకులపతిని పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ఉప కులపతి ఆచార్య డి.భారతి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏకైక మహిళా విశ్వవిద్యాలయమైన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఒక సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు సంతృప్తిగా ఉందని ఆమె పేర్కొన్నారు. వర్సిటీ బోధన,బోధనేతర సిబ్బంది సహాకారంతో పలు కార్యక్రమాలు, అభివృద్ధి పనులు సమర్థవంతంగా చేయగలగామని అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమైంది అన్నారు. వర్సిటీ అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్యంగా అనేక జాతీయ స్థాయి పథకాలు, ప్రాజెక్టు వర్సిటీకి తీసుకురావడం జరిగిందన్నారు. వాటిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, పీఎం ఉషా పథకం కింద యూనివర్సిటీకి 100 కోట్లు మంజూరు, మెరుగైన విద్య కోసం 3 అంతర్జాతీయ విద్య సంస్థలతో అవగాహన ఒప్పందాలు, సౌజోన్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణ, జర్మనీలోని వివిధ విద్యా సంస్థల ప్రతినిధులు యూనివర్సిటీలో పర్యటించి పరస్పర సహకారం, అభివృద్ధి రూపకల్పన, థాయిలాండ్ లోని బ్యాంకాక్ ఏషియా పెసిఫిక్ ట్రైనింగ్ సెంటర్ లాంచ్ ప్రోగ్రాం లు విజయవంతంగా నిర్వహించామన్నారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల ద్వారా అనేక విధములైన నిధులు, వచ్చే ఆగస్ట్ నెలలో 13 దేశాల ప్రతినిధులు ఏషియన్ పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మహిళా యూనివర్సిటీలో నిర్వహించటం జరుగుతుందని అన్నారు. అంతర్జాతీయ సదస్సులు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లు నిర్వహణ వర్సిటీ కి మైలురాయి అని తెలిపారు. భవిష్యత్తులో వర్సిటీని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి జాతీయ స్థాయిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం యొక్క పేరును, ఖ్యాతిని నిలబెట్టుకోవడానికి అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆచార్యులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️