వీడియో రికార్డింగ్‌ చేస్తూ వాహన తనిఖీలు : జెసి

Apr 16,2024 23:56

ప్రజాశక్తి – మాచర్ల : బోర్డర్‌ చెక్‌ పోస్టు వద్ద వీడియో రికార్డు చేస్తూ సమగ్రంగా తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, మాచర్ల నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం బోర్డర్‌ చెక్‌పోస్టు వద్ద తనిఖీలను ఆయన పరిశీలించారు. ప్రతి వాహనాన్ని తనిఖి చేసి సీజ్‌లను ఇఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌లో నివేదించాలన్నారు. క్షేత్ర స్ధాయిలో జరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు నివేదించాలన్నారు. ఆయన వెంట మాచర్ల తహశీల్ధార్‌ మంజునాధ్‌రెడ్డి తదితరులున్నారు.
శాంతిభద్రతల సమస్య రాకుండా పటిష్ట చర్యలు
మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, మాచర్ల నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. గురజాల డిఎస్‌పి, సిఐలు, ఎస్‌హెచ్‌ఓలతో ఆయన తన కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. నామినేషన్‌ ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రచారానికి ఇవ్వవలసిన అనుమతులు, చెక్‌పోస్టు వద్ద తనిఖీలు, పోస్టల్‌ బ్యాలెట్‌, ఇంటింటి ప్రచారం తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. అంతకు ముందు మున్సిపల్‌ కార్యాలయంలో రూరల్‌, టౌన్‌ బిఎల్‌ఓలతో సమావేశం నిర్వహించి హోమ్‌ ఓటింగ్‌, పెండింగ్‌ క్లెయిమ్స్‌, ఇతర ఎన్నికల విధుల గురించి చర్చించారు.
శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్ష
స్థానిక శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులను పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. బ్రహ్మోత్సవాలపై మంగళవారం తన కార్యాలయంలో పలు శాఖల అధికారులతో జెసి సమీక్షించారు. ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన రథోత్సవం రోజున అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రద్దీని నియంత్రిస్తూ, సెక్యూరిటీ, క్యూలైన్లు కోరకు బ్యారికేడింగ్‌లను పోలీసులు పర్యవేక్షించాలన్నారు. ఆలయ ప్రాంతంలో లిక్కర్‌ అమ్మకాలు జరగకుండా సెబ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రథం వెళ్లే ప్రాంతంలో విద్యుత్‌ వైర్లు తొలగింపు, లైటింగ్‌ అంశాలపై విద్యుత్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పారిశుధ్యం రథం తిరిగే బజార్‌లో రహదారి మరమ్మతులపై మున్సిపల్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆర్‌ అండ్‌ బి వారు రథానికి ఫిట్‌నెస్‌ చూడాలన్నారు. రథం రిపేరు పనులను కెసిపి సంస్థ వారు చూస్తారని వివరించారు. ఐడి కార్డ్స్‌ జారి ప్రక్రియను రెవిన్యూ వారు చూస్తారని చెప్పారు. ప్రసాదాలను, వాటర్‌, మజ్జిగ తదితర పంపణి చేసే దాతలకు సహకారాన్ని అందించాలన్నారు.
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటేసేలా బందోబస్తు : ఎస్పీ
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌ అన్నారు. మంగళవారం వెల్దుర్తి మండలం గుండ్లపాడు, కండ్లకుంట, కెపి గూడెం, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ సందర్శించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, సాధారణ అనే విధంగా విభజించామని, దానికి తగ్గట్టు బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. స్థానికులతో మాట్లాడి గత ఎన్నికల సమయంలో తలెత్తిన వివాదాలు, సమస్యలపై తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళి గురించి ప్రజలకు వివరించారు. నిబంధనలు ఉల్లంఘనలకు ఎవరైనా పాల్పడితో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. సిరిగిరిపా డులోని జిల్లా చెక్‌ పోస్ట్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో గురజాల డీఎస్పీ ఏ.పల్లపురాజు, మాచర్ల రూరల్‌ సిఐ కె.సురేష్‌, వెల్దుర్తి ఎస్‌ఐ వి.శ్రీహరి పాల్గొన్నారు.

➡️