విశిష్టమైన కవిత్వాన్ని ఆవిష్కరించిన ‘వేటూరి’

ప్రజాశక్తి-కడప అర్బన్‌ వేటూరి సుందర రామమూర్తి అత్యంత ప్రతిభావంతుడైన కవియని, తెలుగు సినిమా పాటల్లో ఆయన విశిష్టమైన కవిత్వాన్ని పండించారని, సినిమా పాటల్లో ఆయన రాసినంత గొప్ప కవిత్వం మరొకరు రాయలేదని జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జురెడ్డి అన్నారు. వేటూరి వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్‌ఆర్‌ జిల్లా రచయితల సంఘం బుధవారం కడప రాజీవ్‌ కల్చరల్‌ క్లబ్బులో వేటూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ వేటూరి కె.విశ్వనాధ్‌ దర్శకత్వంలో ఓసీత కథ ద్వారా సినిమా రంగానికి పరిచయమై వేలాది పాటలు రాసి గొప్ప కీర్తి నార్జించారన్నారు. డాక్టర్‌ వెల్లాల వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ పదాల పొందికలోను, బావుకతలోనూ ఆయన పాటలు ఎంతో బాగుంటాయని, సాగర సంగమం, శంకరాభరణం సినిమాల్లో పాటలు ఆయనకు అజరామరణమైన కీర్తిని తెచ్చాయని పేర్కొన్నారు. ప్రసిద్ధ రంగస్థలం నటుడు ఎ.విశ్వనాధ్‌రెడ్డి మాట్లాడుతూ అడవి రాముడు, మల్లెపువ్వు, సిరిసిరిమువ్వ, సప్తపది, సీతాకోకచిలుక, స్వాతిముత్యం, సితార, మేఘసందేశం సినిమాల్లో వేటూరి గొప్ప పాటలు రాశారన్నారు. మరో రంగస్థల నటుడు ఎ.గంగయ్య మాట్లాడుతూ వేటూరిని ఆరు నంది పురస్కారాలు వరించాయని, ఆయన మరెన్నో ఉత్తమ పురస్కారాలు అందుకున్నారన్నారు. కార్యక్రమంలో మందల మురళి, తిప్పలూరు ఓబులేసు, వీరదాసరి ప్రకాశం, జ్యోతి జార్జి, బి.బాలఓబయ్య ఎ.గంగయ్య, తపలిస్ట్‌ గంగయ్య, టి.నారాయణయాదవ్‌ పాల్గొన్నారు.

➡️