అందరినోటా ఎన్నికల మాట

Mar 23,2024 20:34

విజయనగరం ప్రతినిధి : ఎన్నికలు దగ్గరపడ్డారు… నోటిఫికేషన్‌ వచ్చి కూడా దాదాపు వారం రోజులు గడించింది. వైసిపి గత శనివారమే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ తిరిగి సిట్టింగులకే అవకాశం కల్పించింది. ఇటు టిడిపి, జనసేన, బిజెపి కూటమిలో విజయనగరం, అరకు ఎంపీస్థానాలు, చీపురుపల్లి అసెంబ్లీ, మన్యం జిల్లా పాలకొండ అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన చోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చేసింది. అభ్యర్థుల ఎన్నికల ప్రచార హోరు కూడా ఇటీవలే జోరందుకుంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో వివిధ పార్టీల బలాబలాలతోపాటు అభ్యర్థుల సామర్థ్యం, సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలపై పబ్లిక్‌ టాక్‌ ఊపందుకుంది. గత ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి స్థానిక సమస్యల పరిష్కారానికి, జిల్లాకి, రాష్ట్రానికి ఇచ్చిన హామీలతోపాటు అంతకు ముందు టిడిపి పాలనలో చేపట్టిన పనులు, పథకాలు, వైఫల్యాలను కూడా భేరీజువేస్తున్నారు. అభ్యర్థులు మాత్రం ఓవైపు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతూనే ఓటర్లను ఆశలపల్లకిలో ముంచే పనిలో నిమగమయ్యారు. అక్కడక్కడా లోబరుచుకునే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ఎన్నికల ప్రచార సామగ్రి సమకూర్చుకునే పనిలో ముఖ్యంగా వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు తలమునకలయ్యాయి. దీంతో, ప్లెక్సీలు, బేనర్లు, పోస్టర్స్‌, కరపత్రాలు వేసే ప్రింటర్లు బిజిబిజీగా మారారు. ఈనేపథ్యంలో ఎన్నికల అధికారులు కూడా ప్రచారానికి పరిమితులు విధించారు. ఇంతకు ముందులా ముందస్తు అనుమతి తీసుకోకుండా అభ్యర్థులు నచ్చిన చోటులో ప్రచారం చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇటు మీడియాలోని రాతలపైనా ఎన్నికల అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాల్లో ఎన్నికల మానటరింగ్‌ సెల్‌ ఏర్పాటుచేశారు. ఎన్నికల ఏర్పాట్లతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో స్పందించే విధంగా తగిన సిబ్బందిని నియమించారు. ఇక చెప్పడాలుండవ్‌… చర్యలే అంటూ ఇప్పటికే రెండు జిల్లాకు చెందిన ఎన్నికల అధికారులు (కలెక్టర్లు) హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రధాన పార్టీల విషయానికి వస్తే ముఖ్యంగా టీడిపిలో దాదాపు అన్ని చోట్లా అంతర్గత విభేదాలు ఎన్నికల సందర్భంగా మరోసారి రచ్చకెక్కాయి. సీట్లు రాక కొంతమంది అలకబూని, తమ కేడర్‌ను కొత్త అభ్యర్థుల వెంట వెళ్లకుండా అడ్డుపడుతున్నారు. భోగాపురంలో పొత్తులో భాగంగా జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా లోకం మాధవిని ప్రకటించినప్పటికీ తెలుగు తమ్ముళ్లు సహకరించని పరిస్థితి దాపురించింది. ఎంపి టిక్కెట్‌ కూడా బిజెపికి కేటాయించ నుండడంతో తమ పార్టీ గుర్తు చూడడానికి కూడా అవకాశం లేకుండా పోయిందంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వైసిపి ప్రమాదకరమైన గ్రూపులేమీ లేకపోయినప్పటికీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, గ్రామ స్థాయి నాయకులకు వివిధ భవనాలు, రోడ్ల నిర్మాణ పనులకు బిల్లులు రూ.కోట్ల పెండింగ్‌లో ఉండడం వల్ల వైసిపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తమ ప్రభుత్వంలో అప్పుల ఊబిలో కూరుకుపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ఇవ్వకపోవడం, ఇచ్చిన అరకొర నిధులు తమ అధినేత ఇతర అవసరాలకు మళ్లించడంతో గ్రామాల్లో వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ వంటి కనీస అవసరాలు తీర్చలేకపోయామని, ఇటు సచావాలయాలు తమ పరిధిలో లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు తమకు సంబంధం లేకుండానే మంజూరయ్యాయని, ఇటువంటి పరిస్థితుల్లో తమ మాట ఇప్పుడు ఎలా చెల్లుబాటు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపిలు అయోమయ పరిస్థితుల నడుమ ఎన్నికలకు సిద్ధమౌతున్నాయి. దీంతో, గ్రామాల్లో సభలకు కూడా వేలాది రూపామలు ఖర్చుచేసుకోవాల్సిన దుస్థితి ఆయా పార్టీలకు ఏర్పడిందని జనం చర్చించుకుంటున్నారు.

➡️