అయోమయoలో వైసిపి కేడర్‌

Mar 21,2024 20:59

విజయనగరం ప్రతినిధి:విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ముఖ్యంగా వైసిపి కేడర్‌ ఎన్నికల వేళ అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా భవనాలు, రోడ్ల నిర్మాణ బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపిటిసి, ద్వితీయ శ్రేణి నాయకులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మరోవైపు సచివాలయాల పవర్‌ అంతా కార్యదర్శుల చేతుల్లో పెట్టడం వల్ల స్థానిక సంస్థల ప్రతినిధుల పాత్ర నామమాత్రంగా మారింది. ఇంకోవైపు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెట్టడం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్ల గ్రామాల్లో పారిశుధ్యం, వీధిదీపాల నిర్వహణ, తాటినీటి సదుపాయం తదితరాలు కష్టతరంగా మారాయి. ఈనేపథ్యంలో నాయకుల్లో వైసిపి ప్రభుత్వంపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తమౌతోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ ప్రభావం అధికార పార్టీపై తప్పక ఉంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, బల్క్‌మిల్క్‌ సెంటర్లు, వెల్‌నెస్‌ సెంటర్‌లో నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవన్నీ వైసిపికి చెందిన సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, లేదా ఆ పార్టీకి చెందిన నాయకులే కాంట్రాక్టు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టారు. ఉపాధి హామీ ద్వారా వచ్చే మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధుల నుంచి వీటికి చెల్లింపులు చేయాల్సివుంది. కేంద్రం సక్రమంగా చెల్లించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేదు. కొన్ని సందర్భాల్లో విడుదలైన నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించిందనే విమర్శలు ఉన్నాయి. ఈనేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ భవన నిర్మాణ పనులకు విజయనగరం జిల్లాలో రూ.28 కోట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.10కోట్ల మేర బకాయి ఉంది. నాడు-నేడు పనుల బిల్లులు కూడా ఒక్క విజయనగరం జిల్లాలోనే రూ.7కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లుల కోసం వైసిపి గ్రామ స్థాయి నాయకులు, సర్పంచలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. వడ్డీలు కూడా చెల్లించుకోలేక పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కక్కలేక మింగలేక అన్నట్టు పార్టీని సమర్థించలేక, అలాగని వదులకోలేక సతమతమౌతున్నామని చెప్తున్నారు. వివిధ రూపాల్లో ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నందున రాజ్యాంగం ప్రకారం సగటు మనిషికి రూ.8చొప్పున పంచాయతీలకు, రూ.4 చొప్పున మండల, జిల్లా పరిషత్తులకు కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సివుంది. ఈలెక్కన ఉమ్మడి విజయనగరం జిల్లాకు రూ.కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాల్సివున్నప్పటికీ సరిగా విడుదల కాలేదు. దీంతో, తాగునీటి మోటార్ల విద్యుత్‌ ఛార్జీల చెల్లింపునకు పంచాయతీలు కటకటలాడు తున్నాయి. వేసవిలో తాగునీటి పథకాల నిర్వహణ, నీటి సరఫరా భారంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. పారిశుధ్య కార్మికులు (గ్రీన్‌ అంబాసడర్లు)కు వేతనాలు చెల్లించలేని దుస్థితి దాపురిస్తోంది. ఇలా ఒకటేమిటి కేంద్ర ప్రభుత్వ వైఖరితో స్థానిక సంస్థల మనుగడ దినదిన గండంగా మారింది. గ్రామ స్థాయిలో సర్పంచులు, నాయకులు నిలదీతలు, చీదరింపులకు గురి కావాల్సిన దుస్థితి ఏర్పడింది. సచివాలయాల నిర్వహణ, సంక్షేమ పథకాల మంజూరు కూడా తమకు సంబంధం లేకుండానే సాగిపోతోందంటూ సర్పంచులు, ఎంపిటీసి సభ్యులు వాపోతున్నారు. ఇలా వైసిపి సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, నాయకులు, పట్టణాల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓవైపు బిల్లులు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో సదుపాయాలు కల్పించలేని పరిస్థితి, ఇంకోవైపు పథకాల మంజూరుకు పరపతి కూడా లేకుండా పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈనేపథ్యంలో వీరు ఎన్నికల్లో వైసిపి విజయానికి ఏమేరకు తోడ్పాటునందిస్తారు? ఒకవేళ పార్టీ విజయానికి కృషి చేసినా ప్రజల మన్ననలు ఎంత వరకు పొందుతారు? అన్నదానిపై రాజకీయ నాయకులతోపాటు సాధారణ ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది.

➡️