ఆస్తులు రికవరీలు చేయాల్సిందే

Jan 24,2024 21:32

ప్రజాశక్తి-విజయనగరం : మోసాలకు పాల్పడిన కేసుల్లో నిందితుల నుంచి ఆస్తులను రికవరీ చేయాల్సిందేనని ఎస్‌పి దీపిక పోలీసు అధికారులకు స్పష్టంచేశారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదు అయిన చీటింగు కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి ఆస్తులను కూడా రికవరీ చేయాలని, సంబంధిత కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా క్రిటికల్‌ పోలింగు కేంద్రాలను, గ్రామాలను సందర్శించాలని సూచించారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టాలన్నారు. పెండింగులో ఉన్న నాన్‌ బెయిలబుల్‌ వారంట్లను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించేందుకు అవకాశం ఉన్న రౌడీషీటర్లను, వ్యక్తులను గ్రామ స్థాయిలో గుర్తించి, వారిని బైండోవరు చేసి, బాండ్లను తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమంగా మద్యం విక్రయించే వారిపై, రవాణకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టులను అధికారులు సందర్శించి, ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం కోసం అనుమతులు కోరుతూ వివిధ పార్టీల నాయకులు చేసే దరఖాస్తు వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ఒక రిజిష్టరును ప్రారంభించాలన్నారు. అనంతరం దర్యాప్తులో ఉన్న గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులను ఎస్‌పి సమీక్షించి, దర్యాప్తు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి దిశా నిర్దేశం చేశారు. ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్‌పి ఎం.దీపిక ప్రత్యేకంగా అభినందించి, వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. సమావేశంలో ఎఎస్‌పి అస్మా ఫర్హీన్‌, ఎస్‌ఇబి డిఎస్‌ఎన్‌ఒ ఎస్‌.వెంకటరావు, ట్రెయినీ ఐపిఎస్‌ మండ జావలి అల్ఫాన్స్‌, డిఎస్‌పిలు ఆర్‌.గోవిందరావు, పి.శ్రీధర్‌, ఎ.ఎస్‌.చక్రవర్తి, వీరకుమార్‌, న్యాయ సలహాదారు వై.పరశురాం, తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.

➡️