ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన

Feb 3,2024 18:47

ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టేందుకు అనువైన కౌంటింగ్‌ కేంద్రాలు, ఇవిఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూములను ఏర్పాటు చేసేందుకు కలెక్టర్‌ నాగలక్ష్మి, ఇతర అధికారులు శనివారం పలు ప్రభుత్వ, ప్రయివేటు భవనాలను పరిశీలించారు. దీనిలో భాగంగా స్థానిక పోలీసు శిక్షణ కళాశాల, డెంకాడ మండలంలోని లెండి కళాశాల, నెల్లిమర్ల మండలంలోని సెంచూరియన్‌ యూనివర్సిటీలను సందర్శించారు. ఆయా కేంద్రాల్లోని భవనాలు, వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పరిశీలించడంతోపాటు రహదారి, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. స్ట్రాంగురూములు, వాటికి సమీపంలోనే లెక్కింపు చేపట్టేందుకు అనువుగా ఉన్న భవనాలను గుర్తించాలని ఆదేశించారు. ఎన్నికల పరిశీలకులు, ఇతర అధికారులు వేచి ఉండేందుకు తగిన గదులను కూడా ముందే గుర్తించాలని సూచించారు. ఆయా సంస్థల ఉన్నతాధికారులు, యాజమాన్య ప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులకు స్వాగతం పలికి, తమ సంస్థల్లోని సదుపాయాలను వివరించారు.ఈ పర్యటనలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌.డి.అనిత, ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ, తహశీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️