కుమారస్వామి సేవలు మరువలేనివి

Jan 31,2024 20:40

ప్రజాశక్తి-విజయనగరం : పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖలో కుమారస్వామి చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్తు సమావేశం మందిరంలో పంచాయతీరాజ్‌ డిఇ కుమారస్వామి ఉద్యోగ విరమణ సన్మాన సభ ఏర్పాటుచేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కుమారస్వామి పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖలో వివిధ స్థాయిల్లో నిబద్ధతతో విధులు నిర్వహించారని తెలిపారు. తనకు అప్పజెప్పిన పనులను తూచ తప్పకుండా సమయానికి పూర్తిచేసి అందరి అదరాభిమానాలు చూరగొన్నారని కొనియాడారు. ఉద్యోగ విరమణ తరువాత కూడా తన శేషజీవితం సుఖసంతోషాలతో సాగాలని కోరారు. పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ జి.ఎస్‌.ఆర్‌ గుప్త మాట్లాడుతూ తన శాఖలో క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఉద్యోగి రిటైర్‌ అవుతుండడం చాలా బాధాకరమని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. తాను తీసుకున్న పనిని సమయానికి పూర్తిచేయడంలో ముందుండేవారని, ఎప్పుడు ఏ సమాచారం అడిగినా వెంటనే ఇచ్చేవారని గుర్తుచేశారు. కార్యనిర్వాహక ఇంజినీర్‌ కెజిజె నాయుడు, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ కళ్యాణ చక్రవర్తి, జెడ్‌పి సిఇఒ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ కుమారస్వామితో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. అనంతరం కుమారస్వామిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ డిఇలు, ఎఇలు, ఉద్యోగులు, విశ్రాంత డిఇలు, ఎఇలు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కుమారస్వామి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

➡️