చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

Mar 18,2024 22:03

ప్రజాశక్తి – డెంకాడ : మండలంలోని చింతలవలస ఐదో బెటాలియన్‌ మెయిన్‌ గేట్‌కి ఎదురుగా ఉన్న సత్యనారాయణపురంలో ఆదివారం అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ఒక ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసింది. రూమ్‌లో నిద్రిస్తున్న భార్యాభర్తలను భయపెట్టి వారి వద్ద ఉన్న నగలను దోచుకోవడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో వారు కేకలు వేయడంతో భర్తను రాడ్లతో కొట్టి పరారయ్యారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..సత్యనారాయణపురానికి చెందిన యారపాటి రమణమూర్తి దంపతులకు లక్ష్మీభరద్వాజ్‌ అనే కుమారుడు ఉన్నాడు. భరద్వాజ్‌కు ఏడాది క్రితం పెళ్లయింది. కుమారుడు, కోడలు ఒక గదిలో నిద్రిస్తుండగా, మరో గదిలో ఇంటి యజమాని రమణమూర్తి, తన భార్య నిద్రిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో వీరి ఇంట్లో నలుగురి గ్యాంగ్‌ చొరబడింది. ఇద్దరు బయట ఉండగా, మరో ఇద్దరు ప్రధాన ద్వారానికి మిషన్‌తో రంధ్రం పెట్టి లోపలి గడియను తొలగించారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించి భరద్వాజ్‌ దంపతులు నిద్రిస్తున్న రూమ్‌లోకి వెళ్లారు. అలజడి కావడంతో కోడలికి మెలకువ వచ్చింది. వెంటనే పక్కనే ఉన్న భర్తకు చెప్పింది. భర్త నిద్ర లేచి దొంగలను చేసి కేకలు వేయడంతో వారి వద్ద ఉన్న రాడ్లతో భరద్వాజ్‌ తలపై తీవ్రంగా కొట్టారు. ఇంతలో ఎదురుగదిలో నిద్రిస్తున్న తండ్రి రమణమూర్తి, తల్లి లేచి కరెంటు సమస్యో ఏమో అనుకుని మీటర్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశారు. ఈ చీకట్లో దొంగలు బయటకు వెళ్లిపోయి, మళ్లీ లోపలికి వచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు నలుగురూ కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే వస్తువులేవీ చోరీకి గురికాలేదు.
అంతా ప్లాన్‌ ప్రకారమే..
ముందుగా గ్యాంగ్‌ ప్లాన్‌ ప్రకారం ఇంటికి రావడానికి ఇనుప కంచె కట్టర్‌తో కట్‌ చేసి ముందుగా తోవ ఏర్పాటు చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటి తలుపులకు ముందుగానే దొంగలు బయట గడియలు పెట్టేశారు. అనంతరం ఇంట్లోకి దొంగతనానికి ప్రవేశించి అడ్డు వచ్చిన భరద్వాజ్‌పై దాడి చేశారు. గాయాలపాలైన భరద్వాజ్‌ స్పృహ కోల్పోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఇలాంటి దొంగతనం ఈ ప్రాంతంలో తొలిసారి జరగడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. సిపి రవిశంకర్‌ పరిశీలనఈ గ్రామం పద్మనాభం మండలం, విశాఖపట్నం అర్బన్‌లో ఉంది. దీంతో సంఘటనా స్థలాన్ని విశాఖపట్నం సిపి రవిశంకర్‌, జాయింట్‌ కమిషనర్‌ పకీరప్ప, డిసిపి-1 విజయ మణికంఠ, క్రైమ్‌ డిసిపి వెంకటరత్నం.. సోమవారం ఉదయం పరిశీలించారు. క్లూస్‌టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ వచ్చి ఆధారాలను సేకరించింది. దొంగతనం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఆరు బృందాలు ఏర్పాటు
దొంగలను పట్టుకునేందుకు ఆరుగురు సిఐల ఆధ్వర్యంలో ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో రామభద్రపురంలో రెండు రోజుల క్రితం జరిగిన దొంగతనం… తాజాగా సత్యనారాయణపురం ఘటన ఒకే మాదిరిగా ఉన్నాయని, ఈ రెండు చోరీలకు ప్రయత్నించిన వారు ఒకే గ్యాంగ్‌ అని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇది చెడ్డీగ్యాంగ్‌ పనేనని పోలీసులు తెలిపారు. ఒకప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోతే దొంగతనాలు జరిగేవని ఇప్పుడు ఇంట్లో మనుషులున్నా దొంగలు ప్రవేశించి అడ్డొస్తే వారిపై దాడి చేసి దొంగతనాలకు పాల్పడడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసు బెటాలియన్‌కు కూతవేటు దూరంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను కొట్టి దొంగతనానికి పాల్పడడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పోలీస్‌ గస్తీ ఉండేదని, ఇప్పుడు అటువంటిదేమీ కనబడకపోవడంతోనే ఇటువంటి దొంగతనాలు జరుగుతున్నాయని, పోలీసు గస్తీని పెంచాలని పలువురు కోరుతున్నారు.

➡️