జగనన్నకు చెబుదాంకు 198 వినతులు

రెవెన్యూ అధికారుల అవినీతిపై ప్లకార్డుతో నిరసన తెలుపుతున్న మహిళ

ప్రజాశక్తి-విజయనగరం కోట : కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా రెవిన్యూ అధికారి ఎస్‌.డి.అనిత, డిప్యూటీ కలెక్టర్‌ డి. వెంకటేశ్వర రావు, బి.సుదర్శన దొర, కె.ఆర్‌.ఆర్‌.సి. డిప్యూటీ కలెక్టర్‌ సుమబాల తదితరులు వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు వాటి పరిష్కారం కోసం పంపించారు. మొత్తం 198 వినతులు అందగా వీటిలో అత్యధికంగా రెవిన్యూ శాఖకు సంబంధించి 138 ఉన్నాయి.
వృద్ధురాలు నిరసన
ఎస్‌.కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన సారిపల్లి రమణమ్మ రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాల కోసం లంచాలు అడుగుతున్నారంటూ స్పందనలో ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపింది. విఆర్‌ఒ అప్పలరాం, ఆర్‌ఐ, తహశీల్దార్‌ లంచం ఇవ్వకపోతే ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపింది. తన భర్త అప్పలనాయుడు, ఆయన సోదరుడు సూరిబాబు భూములకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు 2020లొ ఇచ్చినా 1బి మాత్రం సూరిబాబు పేరున ఇచ్చారని, తమ పేరున ఇవ్వాలని అడిగితే టేకు చెట్లు లంచంగా విఆర్‌ఒ అడిగారని, ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపింది. ఆర్‌డిఒకు గతంలో ఫిర్యాదు చేస్తే 1బి ఇచ్చేయాలని చెప్పినా ఇవ్వడం లేదని ఆవేదన చెందింది.
ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్లు వేగంగా చేయాలి
స్పందన అనంతరం సంయుక్త కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ ఈ నెల 15 నుండి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉన్నందున మండల ప్రత్యేకాధికారులు వారికి ఇచ్చిన లక్ష్యాలను తప్పక నెరవేర్చాలని సూచించారు. ఈ విషయం లో వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఇండోర్‌ స్టేడియం పనులు పూర్తి చేయాలి విజయనగరం విజ్జి స్టేడియంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్టీ పర్పస్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులను పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని నియోజకవర్గ టిడిపి నాయకులు అధికారులను కోరారు. తుపాను వలన పంటను నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని , తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతినిచ్చారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగ్‌ రావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, కనకల మురళీమోహన్‌, కె.శ్రీనివాసరావు, ఇతర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

➡️