డిసిఎంఎస్‌ వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు

Feb 23,2024 21:01

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : డిసిఎంఎస్‌ రానున్న రోజుల్లో తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేస్తుంది. ఈ మేరకు శుక్రవారం విజయనగరం డిసిఎంఎస్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ అవనాపు భావన అధ్యక్షతన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కో-ఆపరేటివ్‌ మేనేజ్మెంట్‌ (ఐసిఎం) శిక్షణ సంస్థకు చెందిన బిజినెస్‌ ఎనలిస్టు రామన్‌, సంస్థ పీడీ శ్యామ్‌కుమార్‌, డిసిఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీ సభ్యులు, బిజినెస్‌ మేనేజర్‌ సాయికుమార్‌ బృందం సమావేశమయ్యారు. రైతులకు డిసిఎంఎస్‌ అండగా నిలిచేందుకు, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు, చిరుధాన్యాల మార్కెటింగ్‌కి సంబంధించి ఈ సమావేశంలో ప్రతిపాదనలు తయారు చేశారు. రాగి ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పేందుకు, జనఔషది పేరిట పేద ప్రజలకు తక్కువ ధరలకే మందులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, జిల్లాలోని బొబ్బిలి, విజయనగరంలో డిసిఎంఎస్‌ స్థలాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాన్ని చేపట్టేందుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా నిధులు సమకూర్చుకుని, ముందుకు సాగేందుకు అవసరమైన ప్రతిపాదనలు డిసిఎంఎస్‌ సిద్ధం చేసింది. ఐసిఎం బృందం ముందుగా జిల్లాలో డిసిఎంఎస్‌లో జరుగుతున్న వ్యాపార లావాదేవీలను, అన్నదాతలకు అందిస్తున్న సహకారాన్ని పరిశీలించింది. రాష్ట్రంలో విజయనగరం డిసిఎంఎస్‌ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పడంతోపాటు గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో డిసిఎంఎస్‌ వ్యాపార అభివృద్ధిని అభినందించారు. కార్యక్రమంలో పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటి సభ్యులు శ్రీరాములు నాయుడు, సన్యాసినాయుడు, బాలి బంగారునాయుడు, డిసిఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌ సాయి కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️