త్వరలో అపరాల కొనుగోలు కేంద్రాలు

Mar 3,2024 20:54

 ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : త్వరలో పెసలు, మినుములు తదితర అపరాల కొనుగోలుకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.టి.రామారావు వెల్లడించారు. మినుములు, పెసలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిందన్నారు. ఇంతకన్నా తక్కువ ధరకు రైతులు విక్రయించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ఏడాది రబీలో మొక్కజొన్న సాగు ఆశాజనకంగా ఉందని, మరో 15 రోజుల్లో పంట చేతికి అందుతుందని తెలిపారు. ఈ వారం తనను కలిసిన ‘ప్రజాశక్తి’కి ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు…
ఈ ఏడాది రబీసాగు ఎంత.?
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రబీ విస్తీర్ణం తగ్గింది. రబీ సాధారణ విస్తీర్ణం 1,62,305 ఎకరాలు కాగా, ఈ ఏడాది 1,00,621 ఎకరాల్లో మాత్రమే సాగు ఉంది. సాధారణ సాగుతో పోలిస్తే 61,684 ఎకరాలు, గతేడాదితో పోలిస్తే 28,775 ఎకరాల చొప్పున సాగు విస్తీర్ణం తగ్గింది. వర్షాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడమే ఇందుకు కారణం.
మినుములు, పెసల మద్దతు ధర ఎంత.?
మినుములు క్వింటా రూ.6,950, పెసలు క్వింటా రూ.8,558 చొప్పున కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించింది. ఈ ఏడాది మినుములు 48,936 ఎకరాలు, పెసలు 24,147 ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. ఇప్పటి వరకు సుమారు 60శాతం కోతలు పూర్తయ్యాయి. మినుములు ఎకరాకు 250 కేజీలు, పెసలు 130 కేజీల చొప్పున దిగుబడి వచ్చింది.
కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు.?
జిల్లాలో సుమారు 20 చోట్ల అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించి ఇప్పటికే మార్క్‌ఫెడ్‌ కమిషనర్‌కు పంపాం. జెసి ఆధ్వర్యాన వ్యవసాయ శాఖ, మార్కెఫెడ్‌ అధికారులు కలిసి ఈ ప్రతిపాదన చేశాం. అపరాల సాగు గంట్యాడ, వేపాడ, ఎల్‌.కోట, జామి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, తెర్లాం, దత్తిరాజేరు, మెంటాడ, బొండపల్లి, సంతకవిటి, రాజాం తదితర మండలాల్లో ఎక్కువగా ఉంది.
మొక్కజొన్న సాగు, మద్దతు ధర ఏ విధంగా ఉన్నాయి.?
మొక్కజొన్న ఈ ఏడాది 45,070 ఎకరాల్లో సాగైంది. గత ఏడాదితో పోలిస్తే పంట ఆశాజనకంగానే ఉంది. మరో 15 రోజుల్లో పంట కోతలు కూడా పూర్తవుతాయి. క్వింటా రూ.2090 చొప్పున ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించింది.
ఇ-క్రాప్‌, ఇ-కెవైసి ఎంత వరకు వచ్చాయి.?
ఇ-క్రాప్‌ సుమారు 99 శాతం వరకు పూర్తయింది. ఇ-కెవైసి కూడా 95 శాతం దాటింది. పంటల బీమాతోపాటు రైతు భరోసా, పంటల కొనుగోలు, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీకి ఇ-కెవైసి అత్యంత కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులంతా స్థానిక ఆర్‌బికెలకు వెళ్లి తప్పక ఇ-కెవైసి చేయించుకోవాలి. లీగల్‌, ఆధార్‌ సాంకేతిక సమస్యలు ఉన్నవారు సంబంధిత మండల వ్యవసాయ శాఖ అధికారులు, తహశీల్దార్ల అంగీకార పత్రాలు తీసుకుంటే సమస్య పరిష్కారమౌతుంది.

➡️