దళితుల సంక్షేమం మరిస్తే బుద్ధిచెబుతాం

ధర్నా చేస్తున్న కెవిపిఎస్‌ నాయకులు, దళితులు, డప్పు కళాకారులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : దళితుల సంక్షేమ పథకాల అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో దళితులంతా ఏకమై ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతామని కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్‌, గౌరవాధ్యక్షులు ఆర్‌. రాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దళితుల సాగు భూములకు పట్టాలివ్వాలని, ఎస్‌సి కార్పొరేషన్‌ 29 రకాల సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని, డప్పు కళాకారుల, చర్మ కారుల పింఛన్‌ ఐదు వేల రూపాయలకు పెంచాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, పెత్తందారులు అక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే పట్టాలు మంజూరు చేస్తున్న ప్రభుత్వం ఏళ్ల తరబడి దళితులు సాగు చేస్తున్న భూములకు పట్టాల మంజూరు చేయకపోవడం హేయమైన చర్యని అన్నారు. ప్రతి మండలంలోనూ దళితుల భూ ములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు భూ రీ సర్వే పేరుతో పేదల సాగు భూములకు పట్టాల మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో అమలకు నోచుకోవడం లేదన్నారు. స్వయం ఉపాధికి ఉపయోగపడే ఎస్‌సి కార్పొరేషన్‌ సంక్షేమ పథకాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని, దళితులపై జరిగే దాడులను అరికట్టాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ధర్నాలో అప్పారావు, డప్పు కళాకారులు,దళితులు పాల్గొన్నారు

➡️