నిండు జీవితానికి రెండు చుక్కలు

Mar 3,2024 20:51

ప్రజాశక్తి-విజయనగరం కోట:  నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు రక్షణ ఇస్తాయని, ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్‌.భాస్కరరావు పిలుపునిచ్చారు. పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని కంటోన్మెంట్‌ పార్కులో ఆదివారం ఆయన ప్రారంభించారు. పిల్లలకు పోలియో చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్లలోపు వయసున్న పిల్లలు సుమారు లక్షా 98 వేల మంది ఉన్నారని తెలిపారు. వీరందరికీ పోలియో చుక్కలు వేయడానికి 1184 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వద్ద కూడా పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. మారుమూల ప్రాంతాలు, మురికివాడలు, సంచార తెగల పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టినట్లు వెల్లడించారు. మొబైల్‌ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఐఒ అచ్యుతకుమారి, ఎంహెచ్‌ఒ సాంబమూర్తి, డాక్టర్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.విజయనగరం టౌన్‌ : పోలియో రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఎన్‌సిఎస్‌ థియేటర్‌ వద్ద ఏర్పాటుచేసిన ఎండ్‌ పోలియో నౌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను కోలగట్ల ప్రారంభించారు. కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు ఆర్‌కె జైన్‌, రవి మండ పాల్గొన్నారు.

➡️