పకడ్బందీగా గ్రూప్‌-2 పరీక్షలు

Feb 23,2024 20:57

ప్రజాశక్తి-విజయనగరం : ఈ నెల 25న జరిగే గ్రూప్‌-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.డి అనిత తెలిపారు. జిల్లాలో 80 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. 80 కేంద్రాలకు గాను 24 రూట్లుగా విభజించి 24 మంది జిల్లా అధికారులను రూట్‌ ఆఫీసర్లుగా నియమించామని చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో రూట్‌ ఆఫీసర్లు, లైజన్‌ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేసి, పరీక్షా నిర్వహణ, నిబంధనలపై డిఆర్‌ఒ అవగాహన కల్పించారు. రూట్‌ అధికారులు ముందు రోజే వారి రూట్లను తనిఖీ చేసుకోవాలని తెలిపారు. పరీక్షా పత్రాలు తీసుకున్న దగ్గర నుండి జవాబు పత్రాలను సబ్‌మిట్‌ చేసే వరకూ చీఫ్‌ సూపరింటెండెంట్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పేపర్లు తీసుకునేటప్పుడు వెన్యూ కోడ్‌ సరి చూసుకోవాలని, పరీక్షకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలని తెలిపారు. లైజన్‌ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద సిసి కెమెరాలు, సీటింగ్‌ ఏర్పాట్లు, తాగునీటి సదుపాయం, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లు ఉండేలా ఏర్పాట్లను చేయాలన్నారు. ఉదయం 9.30 గంటల తర్వాత మెయిన్‌ గేట్లు మూసివేయాలని, పరీక్ష పూర్తయ్యాక 1 గంటకే అభ్యర్థులను బయటకు విడిచిపెట్టాలని సూచించారు. పరీక్ష హాల్లో ప్రతి రూమ్‌ వద్ద అభ్యర్థుల నంబర్లను డిస్‌ప్లే చేయాలని చెప్పారు. వికలాంగులకు, గర్భిణులకు వీలున్నంతవరకు గ్రౌండ్‌ ఫ్లోర్‌ లోనే ఏర్పాటు చేయాలన్నారు. ఎపిపిఎస్‌సి సభ్యులు శంకర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 899 పోస్టుల కోసం 4,83,525 మంది అభ్యర్థులు గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. జిల్లా ప్రధాన కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తామని, సిబ్బందికి గానీ, అభ్యర్థులకు గానీ సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఎపిపిఎస్‌సి అసిస్టెంట్‌ సెక్రటరీ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️