పనిప్రాంతంలో భద్రత అవసరం

Mar 7,2024 20:09

ప్రజాశక్తి-విజయనగరం కోట: మహిళలు అనేక రంగాల్లో ఉద్యోగులుగా ఉంటూ ఆర్థిక పరమైన స్వేచ్ఛను కలిగి ఉన్నారని, అయితే పనిచేసే చోట భద్రత కూడా అవసరమేనని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అభిప్రాయ పడ్డారు. మహిళల భద్రత కోసం కార్యాలయాల్లో అంతర్గత కమిటీలను నియమించాలని చెప్పారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం ముందస్తుగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అనేక రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, ముఖ్యంగా ప్రస్తుతం జిల్లాలో పాలనాపరంగా కీలక పదవులు నిర్వహిస్తున్న అధికారులంతా మహిళలేనని చెప్పారు. మహిళలకు, పురుషులకు జెండర్‌ పరంగా వేర్వేరు పనులు ఉండవని, ఉద్యోగంలో అందరూ సమానమేనని తెలిపారు. ఆడ, మగా సమానమేనని భావన తల్లిదండ్రుల్లో కలగాలని, అప్పుడే సమాజంలో లింగ వివక్ష పోతుందని అభిప్రాయపడ్డారు. ఐసిడిఎస్‌ పీడీ శాంతకుమారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సిడబ్ల్యుసి చైర్‌పర్సన్‌ హిమ బిందు , జిల్లా పరిషత్తు ఐదో స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ శాంతకుమారి, జిల్లా ఆడిట్‌ అధికారి అరుణ కుమారి, ఎపిజిఎల్‌ఐ అధికారి హైమావతి, మత్స్య శాఖ అధికారి నిర్మలకుమారి, డివిజినల్‌ పిఆర్‌ఒ జానకమ్మ తదితరులు మహిళల స్థితిగతులు, స్త్రీల ఔన్నత్యం పై ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులను, వాణిజ్య, వ్యవసాయ, క్రీడలు, సేవా, చేనేత తదితర రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను కలెక్టర్‌ సన్మానించారు.ఆర్‌టిసి డిపోలో.. స్థానిక ఆర్‌టిసి డిపోలో డిపిటిఒ అప్పలనారాయణ ఆధ్వర్యాన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిం చారు. సిడబ్ల్యుసి చైర్‌పర్సన్‌ హిమబిందు, డిప్యూటీ సిఎంఇ కె.శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళా ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ జె.శ్రీనివాసరావు, ఎటిఎం సిహెచ్‌.దివ్య పాల్గొన్నారు.
విజయనగరం టౌన్‌ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది శక్తివంతంగా మారాలని మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి పిలుపునిచ్చారు. మహిళా పార్కులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. మానవహారంగా ఏర్పడి మహిళా శక్తిని ప్రతిబింబించే విధంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ పి.కళావతి పాల్గొన్నారు.
మహిళా కార్మికులకు నేడు సత్కారంఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి స్వగృహంలో మహిళా కార్మికులకు సత్కారం నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి వెల్లడించారు.

➡️