పార్టీ పదవులకు కెఎ నాయుడు రాజీనామా

Feb 24,2024 21:40

ప్రజాశక్తి-విజయనగరం కోట : గజపతినగరం నియోజకవర్గం టిడిపి టిక్కెట్‌ను కొండపల్లి శ్రీనివాస్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవికి, గుంటూరు, మచిలీపట్నం పార్లమెంట్‌ కో ఆర్డినేటర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడు ప్రకటించారు. ఆయనతో పాటు పలువురు మండల స్థాయి నాయకులు కూడా రాజీనామాలు చేశారు.అయితే పార్టీ కార్యకర్తలుగా కొనసాగుతామని వెల్లడించారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన అనుచరులతో కలిసి కెఎ నాయుడు మాట్లాడారు. తాను ఏం తప్పు చేశానో అది నాయకులు తెలపాలని కోరారు. నెల రోజుల క్రితం వైసిపి నుంచి టిడిపిలో చేరిన శ్రీనివాస్‌కు టిక్కెట్‌ కేటాయించడం సరికాదని అన్నారు. ఎన్నికల్లో తాము శ్రీనివాస్‌కు మద్దతుగా పనిచేయలేమని తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు మరోసారి పునరాలోచించుకొని నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల మనోగతం తెలుసుకొని, ఒకటే పార్టీని నమ్ముకొని పార్టీ పట్ల చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసిన కొండపల్లి అప్పలనాయుడుకు టికెట్‌ కేటాయించాలని ద్వితీయ శ్రేణి నాయకులంతా డిమాండ్‌ చేశారు. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వారిలో బొండపల్లి జెడ్‌పిటిసి మాజీ సభ్యులు బండారు బాలాజీ, గజపతినగరం మండల నాయకులు అట్టాడ లక్ష్మునాయుడు, గోపాలరాజు, వివి ప్రదీప్‌కుమార్‌, తదితరులు ఉన్నారు.

➡️