తోటపల్లి నీరు విడుదల

Jun 28,2024 21:07

ప్రజాశక్తి – గరుగుబిల్లి : రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మండలంలోని సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టు నీటిని ఖరీఫ్‌కు శుక్రవారం ఆమె విడుదల చేశారు. తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ వద్ద జరిగిన కార్యక్రమం లో పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి సమక్షంలో మంత్రి నీటిని విడుదల చేశారు. కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రాజెక్టు కింద మొత్తం 1,31,221 ఎకరాల ఆయకట్టుకు నీరంద నుంది. కుడి ప్రధాన కాలువ కింద సీతా నగరం, బలిజిపేట మండలాల్లో 27 గ్రామాలకు చెందిన 13,684 ఎకరాలకు సాగునీరందుతుండగా, విజయనగరం జిల్లా లోని బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాం నియోజక వర్గాలలోని 13 మండలాల్లో 66 గ్రామాలకు చెందిన 25,060 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో జి.సిగడాం, లావేరు, రణస్థలం మండలాల్లో 105 గ్రామాలకు చెందిన 38,975 ఎకరాలకు సాగునీరందు తుంది. 1,31,221 ఎకరాల్లో 84,033 ఎకరాలు స్థిరీకరణ, 47,188 ఎకరాలు కొత్త ఆయకట్టుగా ఉంది. అనంతరం మంత్రి సంధ్యా రాణి మాట్లాడుతూ పూడికలు, తుప్పలు తొలగించి శివారు భూములకు సైతం నీరందించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటపల్లి ప్రాజెక్ట్‌ను ప్రారంభించి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలను సస్యశ్యామలం చేశారని తెలిపారు. తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టులు, పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ రైతులు పంటలు వేసేందుకు భూములను సిద్ధం చేయాలన్నారు. ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడు తూ శివారు భూములకు నీరు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, ఉత్తర కోస్తా జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ ఎస్‌.సుగుణాకరరావు, ఎస్‌ఇ రాజరాజేశ్వరి, ఇఇలు జి.రామచంద్ర రావు, ఆర్‌.అప్పల నాయుడు, డిఇ శ్రీహరి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరందించాలిగరుగుబిల్లి, జియమ్మ వలస మండలాల్లో సుమారు 10 గ్రామాలకు చెందిన 8వేల ఎకరాలకు మూడు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరందించాలని మండల టిడిపి అధ్యక్షులు అక్కేన మధుసూదనరావు, నాయకులు డొంకాడ రామకృష్ణ అంబటి రాంబాబు కోరారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి కుడికాలువ నీటిని విడుదల చేసేందుకు వచ్చిన మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యే టి.జగదీశ్వరికి వినతిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు ఎత్తిపోతల పథకాల ద్వారా 2019న అప్పటి ప్రభుత్వం జిఒ 164 విడుదల చేసిందన్నారు. ఈ జిఒను వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందని వివరించారు. జల వనరులు శాఖ నుంచి అన్ని అనుమతులతో వచ్చిన జిఒను మళ్లీ పునరుద్ధరించి తమ ప్రాంతాలకు సాగునీరివ్వాలని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

➡️