ప్రజల సంతృప్తే లక్ష ్యం

చెక్కు అందజేస్తున్న ఎడిజి ధీరజ్‌ కకాడియా

ప్రజాశక్తి-గంట్యాడ : ప్రజల సంతృప్త స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడమే లక్ష్యమని పిఐడి అదనపు డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ధీరజ్‌ కకాడియా తెలిపారు. గంట్యాడ మండలం తాటిపూడి వద్ద మంగళ వారం నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధీరజ్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, కిసాన్‌ సమ్మాన్‌ యోజన, పోషణ్‌ అభియాన్‌, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, తదితర పథకాలను వివిధ వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. పౌరులు తమ హక్కులతోపాటు బాధ్యతలను కూడా గుర్తించాలని సూచించారు. అనంతరం జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన యాత్ర ప్రగతిని, లక్ష్యాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆయా శాఖల ప్రతినిధులు వివరించారు. గ్రామంలోని సుమారు 180 మంది మహిళలకు డిఆర్‌డిఎ వైకెపి ద్వారా రూ.82.73లక్షల విలువైన మెగా చెక్కును అందజేశారు. అనంతరం స్టాల్స్‌ను సందర్శించారు. కార్యక్రమంలో విబిఎస్‌వై రాష్ట్ర నోడల్‌ అధికారి బి.తారకప్రసాద్‌, ఎంపిపి జైహింద్‌కుమార్‌, సర్వేశాఖ ఎడి త్రివిక్రమరావు, సిబిసి ఎడి షఫీమహ్మద్‌, ఎస్‌బిఐ బ్రాంచ్‌ మేనేజర్‌ నగేష్‌, టిబి కంట్రోల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాణి, హౌసింగ్‌ డిఇ రంగారావు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ఆనందరావు, సర్పంచ్‌ సూర్యనారాయణ పాల్గొన్నారు.

➡️