బాధిత కుటుంబాలకు భువనమ్మ భరోసా

Jan 3,2024 21:16

ప్రజాశక్తి-విజయనగరంకోట, తెర్లాం, రామభద్రపురం : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసానిచ్చారు. న్యాయం కావాలి కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరంతోపాటు తెర్లాం మండలంలో భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో విజయనగరంలోని 23వ డివిజన్‌ పరిధిలోని కోరాడ అప్పారావు, తెర్లాం మండలంలోని పెరుమాళిలో మైలపల్లి పైడియ్య, మోదుగువలసలో గుల్లిపల్లి అప్పలనాయుడు అనే టిడిపి కార్యకర్తలు మరణించడంతో వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక బాధిత కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. బాధితులకు అన్నివేళలా అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.ఘన స్వాగతం న్యాయం కావాలి కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన నారా భువనేశ్వరికి టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చెల్లూరు జంక్షన్‌ వద్ద ఆమెకు టిడిపి నియోజకవర్గ నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి, స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌ గజపతిరాజు, కిమిడి కళావెంకటరావు, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీ మంత్రులు సుజరుకృష్ణ రంగారావు, కోండ్రు మురళీమోహన్‌, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కిమిడి నాగార్జున, అదితి గజపతిరాజు, బేబినాయన, మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత, కె.ఎ.నాయుడు, తెంటు లక్ష్మునాయుడు, సత్యంనాయుడు, నాయకులు ఐవిపి రాజు, లక్ష్మీ వరప్రసాద్‌, బొద్దుల నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️