బాబోయి.. ఇరిగేషన్‌ చెరువులు

ప్రజాశక్తి-బొబ్బిలి : ఇరిగేషన్‌ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలుస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఐదు ఇరిగేషన్‌ ప్యాకేజీ పనులకు టెండర్లు పిలిస్తే రెండింటికి టెండర్లు వేయడమే అందుకు నిదర్శనం. మూడు ప్యాకేజీ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఖరారైన టెండర్లలో పనులు ముందుకు సాగకపోవడం గమనార్హం.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో చెరువులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు ప్యాకేజీల కింద 20 చెరువుల అభివృద్ధికి రూ.9.26 కోట్లు కేటాయించింది. మొదటి ప్యాకేజీలో బాడంగి, సాలూరు, తెర్లాం మండలాల్లో ఐదు చెరువుల అభివృద్ధికి రూ.2.37 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. పనుల కోసం మూడు సార్లు టెండర్లు పిలిచింది. ఒకసారి కూడా టెండర్‌ పడలేదు. రెండో ప్యాకేజీలో మక్కువ మండలంలో 2, గరుగుబిల్లి మండలంలో రెండు చెరువులకు రూ.1.87 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పనులు చేసేందుకు కాంట్రాక్టర్‌ ముందుకొచ్చి, పనులు ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయి. మూడో ప్యాకేజిలో పార్వతీపురం మండలంలో మూడు చెరువులకు రూ.1.86 కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టరు టెండరు వేసి ఒప్పందం జరిగినప్పటికీ పనులు కావడం లేదు. నాలుగో ప్యాకేజీలో బలిజిపేట మండలంలోని నాలుగు చెరువులకు రూ.2.10 కోట్లు మంజూరయ్యాయి. మూడు సార్లు టెండర్లు పిలిచినా ఒకసారి కూడా టెండరు పడలేదు. ఐదో ప్యాకేజీలో బాడంగి మండలంలో ఒకటి, గరుగుబిల్లి మండలంలో ఒకటి, బలిజిపేట మండలంలో రెండు చెరువులకు రూ.1.06 కోట్లు మంజూరయ్యాయి. రెండు సార్లు టెండర్లు పిలవగా ఒక్కసారి కూడా టెండరు దాఖలు కాలేదు. దీన్నిబట్టి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచ బ్యాంకు నిధులకూ..
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రపంచ బ్యాంకు నిధులు ఆరు చెరువుల అభివృద్ధికి రూ.6.61 కోట్లు మంజూరయ్యాయి. చెరువుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 శాతం, ప్రపంచ బ్యాంకు వాటా 70 శాతంతో ఆరు చెరువులకు రూ.6.61కోట్లు మంజూరయ్యాయి. ఆరు చెరువులకు టెండర్లు పూర్తి అయినప్పటికీ మూడు చెరువుల పనులు ప్రారంభమే కాలేదు. మూడు చెరువుల పనులు ప్రారంభమైనా నత్తనడకన సాగుతున్నాయి. బాడంగి మండలంలోని బొమ్మినాయుని చెరువుకు రూ.1.1 కోట్లు, సీతానగరం మండలంలోని తుంబా చెరువుకు రూ.42 లక్షలు, బలిజిపేట మండలంలోని గొల్లంపి చెరువుకు రూ.1.93కోట్లు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. తెర్లాం మండలంలోని రాణి చెరువుకు రూ.85 లక్షలు మంజూరు కాగా రూ.18 లక్షల పనులు మాత్రమే పూర్తి చేశారు. మెరకముడిదాం మండలంలోని కోమటి చెరువుకు రూ.82 లక్షలు మంజూరు కాగా, ఇప్పటి వరకు రూ.21 లక్షల పనులు, సదాశివుని చెరువుకు రూ.2.1 కోట్లు మంజూరు కాగా రూ.41.4 లక్షల పనులు మాత్రమే పూర్తయ్యాయి. బిల్లులు సకాలంలో అవ్వకపోవడం వల్లే కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతులకు అందని సాగునీరు
చెరువుల అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రైతులకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. సాగునీరు అందకపోవడంతో పంటలు సక్రమంగా పండక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువులను అభివృద్ధి చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు.
కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు
చెరువుల అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కొన్ని చెరువులకు పూర్తిగా టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. మరికొన్ని చెరువులలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చినా, వేగవంతంగా చేయడం లేదు. అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– వైవి రాజేశ్వరి, ఇరిగేషన్‌ ఎస్‌ఇ

➡️