బాలికల భద్రత ముఖ్యం

Jan 24,2024 21:28

ప్రజాశక్తి-విజయనగరం : చదువుతో పాటు ఆడపిల్లల భద్రత కూడా ముఖ్యమని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపారు. ఆడపిల్లలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పదంగా వ్యవహరించే వారిపై తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బుధవారం జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ ఆడపిల్లలు జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, దానిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. విద్యతో పాటు నైతిక విలువలు పాటించాలని, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని తెలిపారు. చదువుకునే వయసులో సెల్‌ఫోన్‌ వినియోగం అవసరం లేదన్నారు. ప్రభుత్వం కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో అన్ని వసతులను కల్పిస్తూ విద్యను అందిస్తోందని, ఈ అవకాశాలను బాలికలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళల, బాలల పరిరక్షణ కమిటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ హిమబిందు మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టాలని, చదువుకునే వయసులో పెళ్లి ప్రస్తావన మంచిది కాదని అన్నారు. అనంతరం బాలికల సంక్షేమం కోసం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పలు పోటీలలో గెలుపొందిన విద్యార్ధినులకు బహుమతులను అందజేశారు. ఐసిడిఎస్‌ పీడీ శాంతకుమారి, స్వచంద సంస్థల ప్రతినిధులు, సిడిపిఒలు , చదలవాడ ప్రసాద రావు, తదితరులు పాల్గొన్నారు. విజయనగరంటౌన్‌ : బాలికల భద్రతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని ఐసిడిఎస్‌ పీడీ శాంతకుమారి తెలిపారు. స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో చైల్డ్‌ రైట్స్‌ అడ్వొకసీ ఫౌండేషన్‌, జిల్లా ఫోరమ్‌ ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌ సంయుక్తంగా రూపొందించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎపిడి విజయగౌరి, విజయనగరం జిల్లా ఫోరమ్‌ ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌ సహాయ కార్యదర్శి పీరుబండి సత్యవతి, డొమెస్టిక్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కోరుకొండ వరలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎ.నాగరాజు, సిడిపిఒలు ఎస్తేరురాణి, లైజనింగ్‌ ఆఫీసర్‌ విద్య పాల్గొన్నారు.

➡️