మోటారు కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దు

Feb 5,2024 20:58

ప్రజాశక్తి-బొబ్బిలి : వాహనాల ఫిట్‌నెస్‌, బ్రేక్‌ సర్టిఫికెట్లు జారీ ప్రయివేట్‌ సంస్థలకు అప్పగించి మోటారు కార్మికుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చర్చి సెంటర్లో సోమవారం సిఐటియు ఆధ్వర్యాన రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు వేయడంతో అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిట్నెస్‌ సర్టిఫికెట్లకు అధిక మొత్తంలో ఫీజు పెంచడాన్ని వైసిపి ప్రభుత్వం అంగీకరించడం దుర్మార్గమన్నారు. కొత్తగా ద్విచక్ర వాహనాలకు ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేయడాన్ని తప్పుబట్టారు. రవాణా రంగాన్ని ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్‌ అధ్యక్షులు రాంబాబు, కార్మికులు పాల్గొన్నారు.

➡️