సంక్రాంతి వచ్చిందే తుమ్మెద

Jan 14,2024 19:52

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : పండగ అంటేనే సరదాలు.. సందళ్లు… అందులోనూ సంక్రాంతి అంటే తెలుగు వారింట చెప్పలేనంత అనుభూతి. స్నేహితులు, రక్త సంబంధీకుల అనురాగం. ఆప్యాయత పంచుకునే పర్వదినాలు. పండగకు కొద్దిరోజుల ముందు నుంచే పిండివంటకాలు ఘుమఘుమ లాడేవి. నూతన వస్త్రాలు, కిరాణా సామగ్రి తదితర సరుకుల క్రయ విక్రయాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కళకళలాడేది. ఇదంతా ఒకప్పటి మాట. మారిన ప్రభుత్వ విధానాల వల్ల నేడా పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదు. పేద, మధ్య తరగతి ప్రజానీకమే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం సమస్యలతో సతమతమౌతూ పండగ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఏటా సర్కారు జిల్లా కేంద్రంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేది. ఈసారి అది కూడా కానరాకపోవడంతో మునుపటితో పోలిస్తే సంక్రాంతి సందడి ఒకింత తగ్గిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి నెలరోజుల ముందే…. అంటే నెలగంటు పెట్టినప్పటి నుంచీ రోజూ క్రమం తప్పకుండా ఇళ్లు అలుక్కోవడం (శుభ్రం చేసుకోవడం), సున్నాలు వేసి ప్రత్యేకంగా ముస్తాబు చేయడం వంటి పనులు ప్రారంభిస్తారు. రకరకాల పూలు, రంగులతో ఇళ్ల ముందు వేసిన ముగ్గులు హరివిల్లును తలపించేవి. గొబ్బెమ్మలు పెడుతూ యువతంతా ఆటపాటలతో అలికిరి చేసేవారు. బుడబుక్కల వాళ్లు, హరిదాసులు, కొమ్మ దాసులు… కళలను ప్రదర్శించేవారు. బట్టల వ్యాపారులు సైకిళ్లపై గ్రామగ్రామాల్లో తిరిగి విక్రయించేవారు. ఇలా గ్రామసీమలు కళకళలాడేవి. ఇదంతా ఒకప్పటి మాట. నేడు ఆ పరిస్థితులు మారాయి. మారుతున్న పరిస్థితులు నాటి సంస్కృతీ సంప్రదాయాలను కనుమరుగు చేస్తున్నాయి. ఏటా పండగ తీరు మారుతుండడమే ఇందుకు నిదర్శనం. పూర్వం ప్రభుత్వం తరపున సంక్రాంతి కానుకలు అందేవి. పండక్కి ఒక్కరోజు ముందే జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం తరపున సంక్రాంతి సంబరాలు నిర్వహించేవారు. ఈ సంబరాలతోనే పండగ సందడి ప్రారంభమయ్యేది. నేడు ప్రభుత్వం నుంచి అటువంటి సహకారం, అనుభూతి కరువైంది. దీనికితోడు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్కీమ్‌వర్కర్లు పుట్టెడు దు:ఖంతో ఆందోళనబాటలో ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. చేతికందిన పంట దోపిడీకి గురౌతోంది. అరకొరగా విక్రయించిన ధాన్యం డబ్బులు కూడా చేతికందలేదు. పేద, మధ్య తరగతి ప్రజలు పెరిగిన ధరలను అందుకోలేని పరిస్థితి. సగటు ప్రజానీకం పండగపూట కూడా వంటకాలు ఆరగించి, కొత్తబట్టలు ధరించే పరిస్థితి లేకుండా పోయింది. సంక్రాంతిని మన ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయ పండగగా భావిస్తారు. అందుకు తగ్గట్టే విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 70 శాతం వ్యవసాయ కుటుంబాలే. పంటలసాగు, క్రయ, విక్రయాలతోనే వీరికి సంక్రాంతి పండగ ముడిపడి ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు పెద్దగా అనుకూలించకపోయినా, అష్టకష్టాలు పడి, అధిక పెట్టుబడులతో సాగుచేశారు. పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా ధరలు పెంచలేదు. పెంచిన అరకొర ధరలకు అనుగుణంగానూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేదు. తూకంలో తేడా, ధరలో దగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. విక్రయించిన ధాన్యానికి డబ్బులు సకాలంలో డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటికీ వేలాది మంది ధాన్యం రైతులకు రూ.కోట్లలో బకాయి ఉంది. ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో రైతుల ఇబ్బందులు ఎప్పటి మాదిరిగానే ఉన్నాయి. పండక్కి పక్షం రోజుల ముందే ధాన్యం, ఇతరత్రా వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించి, కొత్తబట్టలు, సంక్రాంతి సరుకులు కొనుక్కునే నాటి పరిస్థితులు నేడు పూర్తిగా తలకిందులయ్యాయి. గంగిరెద్దులు, హరిదాసులు గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతున్నా రైతాంగం పుట్టెడు కష్టాల్లో ఉండడం వల్ల వారికి మునుపటి ఆదరణ దక్కడం లేదు. ప్రజల్లోనూ ఇటువంటి ఉత్సాహం తగ్గింది.

➡️