సిఎం మనసు మార్చు ప్రభువా

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారానికి 14వ రోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈనేపథ్యంలో క్రిస్మస్‌ సందర్భంగా అంగన్వాడీలు కేక్‌ కట్‌ చేసి, కొవ్వొత్తులు వెలిగించి యేసయ్య మీరైనా జగన్మోహన్‌ రెడ్డి మనసు మార్చాలని, అంగన్వాడీలకు న్యాయం చేయాలని కలెక్టరేట్‌ వద్ద సమ్మె శిబిరంలో వినూత్నంగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి జగన్మోహన్‌రావు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ఇష్ట దైవం యేసయ్య ద్వారా ఆయన మనసు మార్చి అంగన్వాడీలకు న్యాయం చేయాలని కేకు ,కత్తిరించి కొవ్వొత్తులతో తమ అభ్యర్థను తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెకు భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) గౌరవ అధ్యక్షులు రెడ్డి శంకర్రావు, జిల్లా కార్యదర్శి బి.రమణ, నగర కార్యదర్శి కంది త్రినాథ్‌ తదితరులు మద్దతు తెలిపారు. సమ్మెలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.బొబ్బిలి : పట్టణంలోని సమ్మె శిబిరంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి బుద్ది ప్రసాదించాలని యేసుక్రీస్తుకు ప్రార్థనలు చేశారు. శిబిరంలో కేక్‌ కట్‌ చేసి ప్రార్థనలు చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన సెల్‌ఫోన్లకు పూజలు చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కామేశ్వరి, అనురాధ, ఉమాగౌరి, నిర్మల, పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, ఇఫ్టూ జిల్లా నాయకులు ఎం.గోపాలం పాల్గొన్నారు. గజపతినగరంరూరల్‌ : నిరవధిక సమ్మెలో భాగంగా గజపతినగరంలో అంగన్వాడీలు 14వ రోజు సోమవారం రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. అంగన్వాడీలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఆర్‌.హరికృష్ణవేణి, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, ఆర్‌టిసి యూనియన్‌ నాయకులు చంద్రయ్య మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు ఎం.సుభాషిని, రాములమ్మ, సన్యాసమ్మ, సౌజన్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.రామభద్రపురం : స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద అంగన్వాడీలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి సిఐటియు మండల కార్యదర్శి బి.శ్రీనివాసరావు మద్దతు తెలిపారు.శృంగవరపుకోట : మండలంలో అంగన్వాడీల సమ్మె సోమవారం కొనసాగింది. వీరికి సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చెలికాని ముత్యాలు, అంగన్వాడీ ప్రాజెక్టు లీడర్‌ డి.శ్యామల, డి.జయలక్ష్మి, వి.మాణిక్యం, కె.సుశీల పాల్గొన్నారు.జామి : తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీల సమ్మె శిబిరం కొనసాగింది. అంగన్వాడీలకు సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి కె.సురేష్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిటియు జిల్లా నాయకులు గాడి అప్పారావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు వెంకటలక్ష్మి, విష్షుణమ్మ, రామలక్ష్మి, కనకమహాలక్ష్మి, వరలక్ష్మి, దేవుడమ్మ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.చీపురుపల్లి : అంగన్‌వాడీల సమ్మె 14 రోజులుగా కొనసాగుతోంది. సోమవారం క్రిస్టమస్‌ పండగ అయినప్పటికీ అంగన్‌వాడీలు మాత్రం తమ సమ్మెను ఆపలేదు. తమ సమస్యలు నెరవేరే వరకు తమ సమ్మె కొనసాగుతుందని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు తెగేసి చెబుతున్నారు.

➡️