సొంత పార్టీ నాయకుల నుంచే దుష్ప్రచారమా?

Jan 22,2024 21:32

వేపాడ: సొంత పార్టీ నాయకులు కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వారితీరు తీవ్ర బాధను కలిగిస్తోందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేశారు. వేపాడలో ప్రయివేటు కళ్యాణ మండపంలో సోమవారం వైసిపి నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అవినీతికి పాల్పడుతున్నట్లు స్వపక్ష నాయకులే వార్తలు రాయించారంటూ విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా జగన్మోహన్‌రెడ్డిని మళ్లీ సిఎంను చేయడమే లక్ష్యంగా ముందుసాగాలని కోరారు. జగనే మళ్లీ సిఎం అయితే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. 27న భీమిలిలో జరిగే బహిరంగ సభకు తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కెజిపూడి గ్రామానికి చెందిన రైతు.. తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆయన స్పందిస్తూ సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సమావేశంలో ఎంపిపి సత్యవంతుడు, జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, డిసిసిబి చైర్మన్‌ వి.చినరామునాయుడు, ఎఎంసి చైర్‌పర్సన్‌ ఎం.కస్తూరి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎన్‌.వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️