అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

May 4,2024 21:39

బాడంగి: అప్పుల బాధతో యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని డొంకినవలస రైల్వేబ్రిడ్జి వద్ద శనివారం చోటుచేసుకుంది. ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది కథనం ప్రకారం… మండలంలోని కోటిపల్లి గ్రామానికి చెందిన బోను వెంకటరమణ (20) ఇంటర్మీడియట్‌ వరకు చదువుకుని ఇంటిదగ్గర ఉంటున్నాడు. క్రికెట్‌ బెట్టింగ్‌కి అలవాటు పడి స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. దీంతో అప్పుల బాధతో శనివారం ఉదయం డొంకినవలస రైల్వే బ్రిడ్జి వద్ద పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని బాడంగి సిహెచ్‌సికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. వెంకటరమణ తండ్రి అనారోగ్యంతో ఇదివరకే మరణించాడు. సోదరుడు, సోదరి, తల్లి ఉన్నారు. తల్లి రవణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆర్‌పిఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఈశ్వరరావు తెలిపారు.

➡️