రిసెప్షన్‌ కేంద్రాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు

May 11,2024 21:43

విజయనగరం : పోలింగ్‌ పూర్తయిన అనంతరం జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి ఎన్నికల సిబ్బంది తీసుకువచ్చే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించేందుకు జిల్లా కేంద్రంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో అన్ని నియోజక వర్గాల ఇవిఎంలు భద్రపరిచేందుకు, ఓట్లు లెక్కింపు కోసం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఆదేశాల మేరకు లెండి ఇంజనీరింగ్‌ కళాశాల, జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. లెండి ఇంజినీరింగ్‌ కళాశాలలో రాజాం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్‌.కోట నియోజకవర్గాల స్ట్రాంగ్‌ రూంలు, రిసెప్షన్‌ కేంద్రాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. జెఎన్‌టియులో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం రిసెప్షన్‌ కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు ప్రదేశాల్లో రోడ్లు భవనాలశాఖ ఎస్‌ఇ విజయరత్నం ఆధ్వర్యంలో రిసెప్షన్‌ కేంద్రాల కోసం ప్రత్యేక జర్మన్‌ హేంగర్‌ లను ఏర్పాటు చేసి వర్షంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి పది సాధారణ కౌంటర్‌లు ఏర్పాటు చేసి రిసెప్షన్‌ కేంద్రాలకు మెటీరియల్‌, ఇవిఎంలు, ఇతర సామాగ్రి తీసుకువచ్చే ఎన్నికల సిబ్బంది నుంచి త్వరగా స్వీకరించే ఏర్పాట్లు చేస్తున్నారు.ఆయా కేంద్రాలకు చేరుకొనే సిబ్బంది రిసెప్షన్‌ కేంద్రాల్లో మెటీరియల్‌ అప్పగించిన అనంతరం రాత్రి భోజనం చేసి వెళ్లేందుకు వీలుగా జెఎన్‌టియు కేంద్రంలో 10 నుంచి 12 వేల మందికి సరిపడేలా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోస జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు జరుగు తున్నాయి. వివిధ నియోజక వర్గాల నుంచి వచ్చిన సిబ్బందికి అవసరమైన సిబ్బందికి సమాచారం ఇచ్చేందుకు హెల్ప్‌ డెస్క్‌ లు కూడా ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ దీపాల ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఒకేసారి వచ్చినపుడు వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. జెఎన్‌టియు., లెండి ఇంజినీరింగ్‌ కళాశాలను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి శనివారం పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సిబ్బంది నుంచి మెటీరియల్‌ ను త్వరగా స్వీకరించే విధంగా ఏర్పాట్లు వుండాలని సూచించారు. అన్ని నియోజక వర్గాల కౌంటర్లను కలెక్టర్‌ పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. పర్యటనలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, ట్రైనీ సహాయ కలెక్టర్‌ సహాదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, మెప్మా పీడీ సుధాకర్‌, జెడ్‌పి సిఇఒ శ్రీధర్‌రాజా, హౌసింగ్‌ పీడీ శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ విజయరత్నం తదితరులు ఉన్నారు.

➡️