భోజరాజపురంలోఎన్నికల బహిష్కరణ

May 13,2024 23:16

దత్తిరాజేరు : మండలంలోని గుచ్చిమి పంచాయతీలోని భోజరాజపురం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గుచ్చిమి పంచాయతీలో 620 మంది ఓటర్లు, భోజరాజపురంలో 250 మంది మొత్తంగా 870 మంది ఓటర్లు ఉన్నారు. గుచ్చిమిలో ఓటర్లంతా ఓట్లు వేసేందుకు ముందుకు రాలేదు.గత కొన్ని దశాబ్దాలుగా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అయినా అధికారులు గాని, ప్రజాప్రతినిధులుగాని పట్టించుకోలేదని ఆవేదన చెందారు. రహదారిలేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సు కూడా రాని పరిస్థితి ఉందని తెలిపారు. ఈనేపథ్యంలో పదిరోజుల క్రితం తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు కలెక్టర్‌కు, ఆర్‌డిఒకు విన్నవించారు. వారి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో తాము ఎన్నికలను బహిష్కరించినట్లు గ్రామ పెద్దలు. సారిపల్లి చంద్రయ్య, బోను రాము, బోను పైడితల్లి, కె.సచ్చారావు, మీసాల అప్పలనాయుడు, తెల్ల సీతయ్య తదితరులు తెలిపారు. తమ సమస్యలు ఇలాగే ఉంటే భవిష్యత్తులో పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. గ్రామంలో సిసి రోడ్లు గాని, మరుగుదొడ్లు, కాలువలు, తాగునీరు లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో తహశీల్దార్‌, ఎంపిడిఒ వచ్చి పోలింగ్‌లో పాల్గొనాలని చెప్పారు. అయినా వారు ఓట్లు వేసేందుకు ముందుకు రాలేదు. తమ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటుచేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని, అప్పటివరకూ తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

➡️