బాబు హామీలను నమ్మొద్దు : జగన్‌

May 1,2024 21:54

సూపర్‌సిక్స్‌లో ఉన్నవన్నీ పాత వాగ్ధానాలే

అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయకుండా వాటినే మళ్లీ జనంలోకి

చంద్రబాబుపై సిఎం జగన్‌ విమర్శలు

ప్రజాశక్తి – బొబ్బిలి  : చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్నవన్నీ పాత హామీలేనని, అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయకుండా వాటినే మళ్లీ జనంలోకి వదులుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. బొబ్బిలిలోని స్థానిక బలిజిపేట రోడ్డు జెండావీధి జంక్షన్లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సిఎం జగన్‌ మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మవద్దని ప్రజలను కోరారు. 2014లో టిడిపి అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తామని చెప్పి రూ.87వేల 612 కోట్లు మాఫీ చేయలేదన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రూ.14వేల 205 కోట్లు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. ఆడపిల్ల పుడితే బ్యాంకు ఖాతాలో రూ.25వేలు వేస్తామని చెప్పి ఒక్కరూపాయి కూడా వేయలేదన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భతి ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్‌ లాగా అభివృద్ధి చేస్తామని, ప్రతి నగరాన్ని హైటెక్‌ సిటీ చేస్తామని చెప్పిన బాబు ఆచరణలో అభివృద్ధి చేయలేదని అన్నారు. ఆ హామీలేవీ అమలు చేయకుండా ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు కొత్తకొత్త మోసాలతో సూపర్‌ సిక్స్‌ మ్యానిఫెస్టోతో ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు. మోసకారి చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ కాదు సూపర్‌ సెవెన్‌ మ్యానిఫెస్టోతో వచ్చినా ప్రజలు నమ్మబోరన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటించి ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు టికెట్లు కేటాయించామని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం మెరుగుకు, పేదవాడుకి న్యాయం జరగాలన్న, అవినీతి రహిత పాలన అందించాలన్న రానున్న ఎన్నికల్లో వైసిపిని గెలిపించాలని కోరారు.

బాబు హామీలను నమ్మొద్దు : జగన్‌

సభలో వైసీపీ ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.ఎండల తీవ్రతకు సొమ్మసిల్లి పడిపోయిన మహిళరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల సభకు వచ్చిన ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. సిఎం జగన్మోహన్‌ రెడ్డి సభ గంట ఆలస్యంగా ప్రారంభం కావడంతో సభకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండలు అధికంగా ఉండడంతో తాగునీరు లేక దాహంతో ఇబ్బందులు పడ్డారు. కోట జంక్షన్లో ఒకమహిళ సొమ్మసిల్లి పడిపోయింది.40 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న జగన్‌ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బొబ్బిలి సభకు 40నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు. ఉదయం 10.45 నిమిషాలకు బొబ్బిలి చేరుకోవాల్సి ఉన్నప్పటికీ 11.25 నిమిషాలకు చేరుకున్నారు. హెలిప్యాడ్‌ నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌, రైల్వే జంక్షన్‌, పోలీసు స్టేషన్‌ మీదుగా సభా వేదికకు సిఎం జగన్‌ బస్సులో చేరుకున్నారు. అనుకున్న సమయం కంటే ఆలస్యంగా రావడంతో కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిఎం జగన్‌కు ఉత్తరాంధ్ర కన్వీనర్‌ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఘన స్వాగతం పలికారు.

➡️