వృద్ధులను ఇబ్బందులు పెట్టడం అన్యాయం

Apr 1,2024 12:00 #Vizianagaram

ప్రజాశక్తి-బొబ్బిలి : రాజకీయ కక్షతో వృద్ధులను ఇబ్బందులు పెట్టడం అన్యాయమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తే నేడు ఎన్నికల్లో ఓటమి భయంతో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయకుండా మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ తో అడ్డుకోవడం అన్యాయమన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. నిమ్మగడ్డ రమేష్ ను అడ్డం పెట్టుకుని ఎన్నికల అధికారికి పిర్యాదు చేయడం అన్యాయమన్నారు. వృద్ధులకు ఇబ్బందులు పెట్టే విధంగా ఆదేశాలు జారీ చేయడం అన్యాయమన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. తెల్లవారి సరికే వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్ అందేదని, నేడు అందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీకు పని చేస్తామని ముందుకు వస్తున్నారని చెప్పారు. మండుటెండలో పెన్షన్ కోసం సచివాలయాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఈవిషయంపై ఎన్నికల కమిషన్ ఆలోచించి ఉంటే బాగుండేదన్నారు. వాలంటీర్లు బాధపడవద్దన్నారు. సింగమనల టికెట్ దళితుడికి ఇస్తే చంద్రబాబు అవహేళన చేయడం దళితులను అవమానించడమేనన్నారు. ఉపాధి కోసం ట్రాక్టర్ నడిపితే తప్పా అని ప్రశ్నించారు. గతంలో కూడా దళితులపై తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. రాష్ట్రంలో 138 బిసి కులాలను 58కార్పొరేషన్లు చేసి ఆదుకున్నారన్నారు.

➡️