రైవాడ నీరందేనా?

May 19,2024 20:53

ప్రజాశక్తి – వేపాడ : వేపాడ మండలం విజయనగరం జిల్లాకు చెందిందే. అయినా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల పరిధిలోని రైవాడ గ్రామం వద్ద రైవాడ జలాశయాన్ని 2005లో నిర్మించారు. దానికి ద్వారా వేపాడ మండల రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కొంతకాలం విశాఖపట్నం ప్రజలకు తాగునీటి కోసం ఈ జలాశయం నీటిని వాడుకుంటామని చెప్పారు. ఏలేరు కాలువ పనులు పూర్తి కాగానే రైవాడ రిజర్వాయర్‌ నీటిని శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఐదు మండలాల రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకూ రైవాడ రిజర్వాయర్‌ నుంచి సాగునీటిని వేపాడ మండలానికే కాదు, శృంగవరపుకోట నియోజకవర్గానికీ అందించలేదు. దీంతో 25 ఏళ్లుగా రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. రైవాడ రిజర్వాయర్‌ నుంచి విశాఖకు చెందిన మేఘాద్రి గెడ్డకు నీటిని తరలించేందుకు వేపాడ మండలానికి చెందిన కడకొండ, వావిలపాడు, నల్లబెల్లి, చిన్నగుడిపాల, నీలకంఠరాజపుర అగ్రహారం, బల్లంకి, ఎకెజిపాలెం, కెఆర్‌ఎఫ్‌ పేట గ్రామ రెవెన్యూ పరిధిలోని జిరాయతీ భూముల్లో నుంచి కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కాలువ నిర్మాణానికి భూములు ఇస్తే సాగునీరందిస్తామని చెప్పారు. కానీ చుక్క నీటిని కూడా ఇవ్వలేదు. ఒకానొక దశలో బల్లంకి గ్రామస్తులు తమ గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు నుంచి కాలువ వరకు సుమారు ఆరు కిలోమీటర్లు సొంతంగా కాలువ చదును చేసుకున్నారు. ఆ కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే సుమారు 30 గ్రామాల వరకు సాగునీరు అందే అవకాశం ఉందని చెప్పి పోరాటం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా కాలువ ద్వారా నీటిని విడుదల చేయలేదు. ఎన్నో పోరాటాలు రైవాడ రిజర్వాయరు నీటిని రైతులకు ఇవ్వాలని పలుమార్లు రైవాడ రైతుల నీటి సంఘం నాయకుడు వేచలపు వెంకట చినరామునాయుడు ఆధ్వర్యంలో పోరాటం సాగించారు. ధర్నాలు చేసే సమయంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన అధికారులు వచ్చి తప్పనిసరిగా రైవాడ కాలువ నీటిని రైతులకు అందజేస్తామని చెప్పి వెళ్లిపోయేవారు. అంతేతప్ప ఇంతవరకు రైతులకు సాగు, తాగునీరు అందించేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పార్టీలు మారినా.?నియోజకవర్గంలో 25 ఏళ్ల కాలంలో మూడు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కానీ రైతుల సమస్యలను మాత్రం పరిష్కరించలేదు. ఎన్నికల ముందు మాత్రం రైతులకు ఉన్న సాగునీటి కష్టాలను తీర్చేస్తామని హామీలిచ్చి తరువాత వాటిని తుంగలో తొక్కుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా కోళ్ల లలితకుమారి, ఒకసారి ఎమ్మెల్యేగా కడుబండి శ్రీనివాసరావు ఎన్నికైనా సమస్యలను మాత్రం పరిష్కరించలేకపోయారు. దీంతో రైతులు ప్రభుత్వాలు మారినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని రైతులకు సాగు, తాగునీటిని రైవాడ రిజర్వాయర్‌ ద్వారా అందించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

➡️