అంగన్వాడీల భిక్షాటన, ర్యాలీ..

Dec 20,2023 16:24 #Kakinada
kkd anganwadi workers strike on 9th day

9వ రోజుకి చేరిన అంగన్వాడీలు సమ్మె

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డిమాండ్ల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె బుధవారానికి 9వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి రోడ్డు మీద వాహనాల్లో వెళ్ళే వారి వద్ద దుకాణాల వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు, సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి పి రమణమ్మ లు మాట్లాడుతూ ఒక్క అవకాశం అన్నందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి మహిళలు రోడ్లెక్కి భిక్ష ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని ఆరోపించారు. ఇన్నిరోజులుగా అంగన్వాడీలు ఇళ్ళు, కుటుంబాలను వదిలి రోడ్లెక్కి నిరసనలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనీ అమలు చేయాలని కోరుతున్నామని అదనంగా మేము ఏమి కోరడం లేదన్నారు. 9 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఎంత ఆలస్యం చేస్తే అంత పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట సాయంత్రం నాలుగు గంటల వరకు నిరసన కొనసాగించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

➡️