ఘనంగా కోడి రామమూర్తి ఆరాధనోత్సవాలు

Jan 28,2024 11:55 #Vizianagaram
kodi ramutrhy statue in vzm

విగ్రహాన్ని ఆవిష్కరించిన డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కలియుగ భీముడు కోడి రామమూర్తి ఆరాధనోత్సవాలు ఘనంగా ఆదివారం నాడు జరిగాయి. ఉదయం కోడి రామమూర్తి పార్కు వద్ద ఏర్పాటు చేసిన కోడి రామమూర్తి విగ్రహాన్ని డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీగా క్రీడాకారులు తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బల ప్రదర్శన ద్వారా విజయనగర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన మహోన్నత వ్యక్తి కలియుగ భీమ కోడి రామమూర్తి నాయుడు అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కొనియాడారు. ప్రపంచంలోని అత్యంత బలశాలిగా, కలియుగ భీముడిగా పేరుగాంచిన కోడి రామమూర్తి నాయుడు వ్యాయామ ప్రక్రియలు భావితరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఆయన విగ్రహాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విజయనగరంలో కోడి రామ్మూర్తి వ్యాయామశాల అతి ప్రాచీనమైనదని అన్నారు. ఆధునిక పరికరాలతో ఎన్నో ప్రైవేటు వ్యాయామశాలలు నెలకొల్పినప్పటికీ కోడి రామ్మూర్తి వ్యాయామశాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ తర్ఫీదు పొందిన ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బహుమతులను గెలుచుకున్న ఘనత ఉందన్నారు. మూడు టన్నుల రోడ్డు రోలర్ను చాతిపై ఎత్తుకున్న బలశాలిగా పెద్ది లక్ష్మీనారాయణ మూర్తి పేరుగాంచారన్నారు. ఆనాడు అప్పుసాని అప్పన్న దొర ఈ వ్యాయామశాలను అభివృద్ధి చేశారని తర్వాత కాలంలో మరమ్మతులకు గురైన పరిస్థితిలో ఈమధ్య 16 లక్షల రూపాయలతో వ్యాయామశాలలో మరమ్మతులు చేయించామన్నారు. 28 లక్షల రూపాయలతో ఇండోర్ స్టేడియం ను అభివృద్ధి చేశామన్నారు. ప్రకాశం పార్క్ శిధిలావస్థకు చేరుకోవడంతో కోటి రూపాయల నిధులు వెచ్చించి రాష్ట్రంలోనే తొలి మహిళా పార్కుగా తీర్చిదిద్దామన్నారు. నెహ్రూ పార్కును చిల్డ్రన్స్ పార్క్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలోని ప్రధాన జంక్షన్లో వివిధ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వ్యాయామశాల ప్రాంతంలో కోడి రామమూర్తి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యాయామ ప్రక్రియ ద్వారా శారీరిక మానసిక ఉల్లాసంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కూడా రిజర్వేషన్లు పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, లయ యాదవ్, వ్యాయామ సమాజం అధ్యక్షురాలు పెనుమజ్జి విజయలక్ష్మి, కార్యదర్శి పెద్ది లక్ష్మీనారాయణ, పివి నరసింహారాజు, రంగారావు దొర, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్ బంగారనాయుడు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

➡️