పర్యవేక్షణా లోపం.. సంపద సృష్టికి శాపం

May 24,2024 21:14

ప్రజాశక్తి-రేగిడి : గ్రామాల్లో పారిశుధ్య మెరుగు కోసం 2016లో అప్పటి ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టి తయారీ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీంతో కొన్ని గ్రామాల్లో ఆ కేంద్రాలను నిర్మించారు. మరికొన్ని గ్రామాల్లో స్థల సమస్య ఏర్పడింది. నిర్మించిన చోట ఆచరణ లేక అలంకార ప్రాయంగానే మిగిలాయి. జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపమే చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలకు శాపంగా మారాయి. దీంతో గ్రామాల్లో అపారిశుధ్యం నెలకొంది. దీంతో ఎక్కడ చెత్త అక్కడే అన్న చందంగా తయారైంది.రాజాం నియోజకవర్గంలో రేగిడి, సంతకవిటి, వంగర, రాజాం మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో 120 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2016లో అప్పటి టిడిపి ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు పంచాయతీలకు సంపద సృష్టి కేంద్రాల(ఎస్‌డబ్ల్యుపిసి)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించి మంజూరు చేసింది. గ్రామాల్లో సేకరించిన చెత్తతో కంపోస్ట్‌ ఎరువు తయారు చేసి, రైతులకు విక్రయించడం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలన్నది వీటి ఉద్దేశం. అందులో భాగంగా మంజూరు చేసిన కేంద్రాల్లో నియోజకవర్గంలో కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తి కాగా, కొన్నిచోట్ల ఇంకా నిర్మాణంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సంపద తయారీ కేంద్రాలు పూర్తయిన చోట చెత్త నుంచి సంపద తయారీ మాత్రం కావడం లేదు. పలు గ్రామాల్లో చెత్తను తీసుకువచ్చి బహిరంగ ప్రాంతాల్లో వేయడం, అవి దుర్గంధం వెదజల్లడంతో గ్రామస్తులు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని గ్రామాల ప్రధాన రహదారిలో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు లేకపోవడంతో రోడ్లపైనే తడి, పొడి చెత్త వేసిన సందర్భాలున్నాయి. పొగ కారణంగా ఆ ప్రాంత ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.కాగితాలకే పరిమితంగ్రామాలను స్వచ్ఛ సంకల్ప గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చెత్తను ఎత్తేందుకు అంబాసిడర్లుగా కొంతమందిని నియమించారు. గ్రామ పంచాయతీ నుంచి వీరికి వేతనాలు, వాహనాలు సమకూర్చి, సంపద తయారీ కేంద్రాలకు చెత్తను తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. వాటిని తడి, పొడి చెత్తగా వేరు చేసి ఎరువుగా తయారు చేయాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. తయారైన ఎరువులు రైతులకు విక్రయించి తద్వారా ఆయా గ్రామ పంచాయతీలు ఆదాయ వనరులు పెంచుకునేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే ఈ ప్రణాళికలు కాగితాలకే పరిమితం అయ్యాయి. సంబంధిత శాఖాధికారులు తూతూ మంత్రంగా పనిచేస్తున్నారే తప్ప ప్రభుత్వం లక్ష్యాన్ని అమలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా అధికారుల పర్యవేక్షణ అసలే లేదని, దీంతో మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామాల్లోకి సచివాలయ ఉద్యోగులు.. ఉన్నతాధికారులు వచ్చే సమయంలో రోడ్లపైన బ్లీచింగ్‌ చల్లించి, చేతులు దులుపుకుంటున్నారని వాపోయారు.
ఇదీ రాజాం నియోజకవర్గంలో ఎస్‌డబ్ల్యుపిసిల పరిస్థితి
రేగిడి మండలంలో 39 పంచాయతీలుంటే, 27 పంచాయతీల్లో సంపద సృష్టి కేంద్రాలు ఏర్పాటు చేశారు. సంకిలి, ఉంగరాడ, వన్నలి కండ్యాం, కొమిరి, చిన్ని శిర్లాం పంచాయతీల్లో పూర్తిగా నిర్మాణాలు చేపట్టలేదు. కోడిస, అప్పాపురం, దేవుదలలో వివిధ స్థాయిలో ఉన్నాయి. శ్రీ సంతకవిటి మండలంలో 34 పంచాయతీలకు 23 సంపద సృష్టి కేంద్రాలు పూర్తయ్యాయి. మిగిలినవి స్థలాలు లేక పూర్తి కాలేదు. శ్రీ వంగర మండలంలో 27 పంచాయతీలు ఉండగా కేవలం 14 మాత్రమే నిర్మించారు. మిగిలినవి నిర్మించలేదు. శ్రీ రాజాం మండలంలో 20 పంచాయతీలు ఉండగా14 సంపద సృష్టి కేంద్రాలు పూర్తయ్యాయ. మిగిలినవి స్థలాలు లేక నిర్మాణాలు చేపట్టలేదు.
వినియోగంలోకి తెస్తాం
గ్రామ పంచాయతీల్లో గతంలో నిర్మించిన చెత్త సంపద సృష్టి కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. గ్రామ సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేసి ఆచరణలోకి తీసుకొస్తాం. వీటి నిర్వహణకు గ్రామ పంచాయతీలదే బాధ్యత. దీనిపై కార్యదర్శులకు ఆదేశాలు అందిస్తాం. సంపద సృష్టి కేంద్రాల వల్ల గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడుతుంది. ప్రజలు సహకరించాలి. –  శ్యామలకుమారి, ఎంపిడిఒ, రేగిడి

➡️