ఆ కుటుంబాల వల్లే ఉత్తరాంధ్ర వెనుకబాటు

Apr 7,2024 21:27

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటుకు, ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోవడానికి మూడు కుటుంబాలే కారణమని పల్సస్‌ సిఇఒ గేదెల శ్రీనుబాబు అన్నారు. ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మూడు కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయే తప్ప ఇతరులెవరూ వృద్దిలోకి రావడం లేదని చెప్పారు. ఆ కుటుంబాల కారణంగా లక్షలాది మంది ఉత్తరాంధ్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు భవన నిర్మాణ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా వలస పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్థానికులను కాదని వలస నాయకులను ప్రోత్సహించడం సమంజసం కాదన్నారు. వలస నాయకుల కారణంగా స్థానిక నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి, తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే ధ్యేయంగా పల్సస్‌ సంస్థ పనిచేస్తుందని, ఇప్పటివరకు సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యావరణానికి నష్టం కలిగించని పరిశ్రమలను స్థాపించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా పల్సస్‌ సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. జిల్లాలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో తూర్పు కాపు సామాజిక వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మజ్జి అప్పారావు, జిల్లా అధ్యక్షులు రొంగలి రామారావు, టి.వెంకటరమణ, ముదిలి నాగభూషణం, తాట్రాజు రాజారావు, బొత్స శ్రీను, రుషికేష్‌ పాల్గొన్నారు.

➡️