నోటాకు ఓట్లు గళగళ

Jun 5,2024 21:20

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్నో చిత్ర, విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఫలితాలు వన్‌ సైడ్‌ వార్‌లో వచ్చినప్పటికీ దాదాపు అన్నిచోట్లా అభ్యర్థులను ఇష్టపడక వేలాది మంది ఓటర్లు తమ ఓట్లను నోటాకు గుద్దేశారు. అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్ధికి ఈసారి ఓట్లు బాగానే పెరిగాయి. కానీ, మిగిలిన 12మంది ఎంపీ అభ్యర్థులను ఇష్టపడని ఓటర్లు అరలక్షకుపైగానే ఉన్నారు. విజయనగరం పార్లమెంట్‌లో ఎంపీ కలిశెట్టికి క్రాస్‌ ఓటింగ్‌ పడింది. విజయనగరం అసెంబ్లీలో వైసిపి అభ్యర్థికి వచ్చిన ఓట్లు, ఆయనపై విజయం సాధించిన అతిధి విజయలక్ష్మి గజపతిరాజుకు వచ్చిన మెజార్టీ ఓట్లతో సమానంగానే ఉండడం గమనార్హం. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం 11 అసెంబ్లీ స్థానాల్లో గెలిచినవారిలో తొమ్మిది మంది కొత్తముఖాలే. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలన్నీంటిలో 8 నుంచి 13 మంది వరకు పోటీచేసిన సంగతి తెలిసిందే. వీరందర్నీ వ్యతిరేకిస్తూ విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో మొత్తం 34,163 మంది నోటాకు ఓట్లు వేశారు. ఇందులోనూ మన్యం జిల్లా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా సాలూరు నియోజకవర్గంలో 5,743 మంది, కురుపాంలో 4,761 మంది, పాలకొండలో 4,260 మంది, పార్వతీపురంలో 3,465 మంది నోటాకు వేశారు. విజయనగరం జిల్లా పరిధిలో అత్యధికంగా గజపతినగరంలో 3,729, నెల్లిమర్లలో 3,305 మంది నోటాకు వేశారు. బొబ్బిలిలో అత్యల్పంగా 175 మాత్రమే నోటాకు ఓట్లు పడ్డాయి. విజయనగరంలో 1,365 మంది, ఎస్‌.కోటలో 1969 మంది, చీపురుపల్లిలో 2,855 మంది, రాజాంలో 2,536 మంది నోటాకు వేశారు. విజయనగరం పార్లమెంట్‌లో 15మంది పోటీలో నిలిచినప్పటికీ 23,250మంది నోటాకు వేయగా, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గంలో 13మంది అభ్యర్థులను వ్యతిరేకిస్తూ 50,470 మంది నోటాకు వేశారు. దీన్నిబట్టి ఏజెన్సీ ప్రాంతంలోని అభ్యర్థులపై ప్రజావిశ్వాసం తగ్గినట్టుగా కనిపిస్తోంది. అరకు సిపిఎం ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స 1,23,129 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గతంతో పోలిస్తే ఆయనకు ఓట్లు బాగా పెరిగాయి. విజయనగరం అసెంబ్లీ వైసిపి అభ్యర్థి (శాసన సభ మాజీ డిప్యూటీ స్పీకర్‌) కోలగట్ల వీరభద్రస్వామికి స్వామికి 60,632 ఓట్లు రాగా, ఆయనపై విజయం సాధించిన పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు 60,609 ఓట్లు మెజార్టీ రావడం గమనార్హం. ప్రత్యర్థికి వచ్చిన ఓట్లతో దాదాపు సమానంగా ఆమెకు మెజార్టీ వచ్చిందని జనం చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేల ఓట్లతో పోలిస్తే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు ఓట్లు అధికంగా వచ్చాయి. ఏడు నియోజకవర్గాల్లోని టిడిపి అభ్యర్థులందరికీ కలిపి 2,32,169 ఓట్ల మేర మెజార్టీ రాగా, ఎంపీకి 17,182 ఓట్లు అదనంగా రావడం గమనార్హం. దీన్నిబట్టి పలు చోట్ల కలిశెట్టికి అదనంగా క్రాస్‌ ఓట్లు పడ్డాయని స్పష్టమౌతోంది. ఈ రెండు జిల్లాల్లో గల మొత్త 11 అసెంబ్లీ స్థానాల్లో పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, నెల్లిమర్లలో కొత్త ముఖాలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా రాజకీయ వారసత్వం ఉన్నవారు. మిగిలిన ముగ్గురిలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖమంత్రిగా పనిచేశారు. చీపురుపల్లిలో ఎన్నికైన కిమిడి కళావెంకటరావు చంద్రబాబు ప్రభుత్వంలో పలు శాఖల మంత్రిగా పనిచేశారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇప్పటి వరకు మూడు సార్లు విజయం సాధించారు.

➡️