5వ రోజుకి చేరిన అంగన్వాడీల సమ్మె

Dec 16,2023 16:43 #Vizianagaram
vzm anganwadi strike 5th day town

మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకొని కలెక్టరేట్ వద్ద నిరసన
మద్దతు తెలిపిన ఎపిటీఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు జోగినాయుడు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 5వ రోజుకి చేరుకుంది. జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె లో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్సు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జరిపిన చర్చల్లో ఆర్ధిక పరమైన డిమాండ్ లు పరిష్కారానికి చొరవ చూపకుండా చర్చలు ముగించడం సరికాదన్నారు. మేము ఎది అదనంగా కోరడం లేదని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చెయ్యాలని కోరుతున్నామన్నారు. 5 రోజులు కావస్తున్నా సమస్యలు పరిష్కారం చేయకుండా, మరో వైపు అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తాళాలు పగలు కొట్టించడం ప్రభుత్వానికి తగదన్నారు. సచివాలయం ఉద్యోగులు కూడా తోటి ఉద్యోగులేనని, చాలా జిల్లాలో సచివలయం ఉద్యోగులు కేంద్రాలను తెరిచేందుకు ముందుకు రాలేదని జిల్లాలో ఉన్న సచివాలయం ఉద్యోగులు మాకు సహకరించాలని కోరారు. బలవంతంగా కేంద్రాలు తేరిపించడం, మమ్మల్ని బెదిరించడం వంటి చర్యలు మానుకోవాలని, బెదిరింపులకు భయపడేది లేదని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం మా ఆర్ధిక పరమైన డిమాండ్ లు పరిష్కారం చేసే వరకు సమ్మె కొనసాగుతుందని ఆమె హెచ్చరించారు. సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఏపిటీఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు బంకురు జోగినాయుడు అంగన్వాడీలు సమ్మెకు మద్దతు తెలిపారు. అంగన్వాడిలు చేస్తున్నది న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం జిల్లా అధికారులకు మూకుమ్మడిగా వెళ్లి అంగన్వాడీలు వినతి పత్రం అందజేశారు. సమ్మె నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️